(దండుగుల శ్రీనివాస్)
ఓ టీవీ చానెల్ అధినేత గొంతుచించుకుంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం కాదా..? ఎవర్నీ వదల్లేదు. మీడియా అధిపతులను అని ఓ మాటన్నాడు. తను మాత్రం ఆ లిస్టులో లేడు. పాపం.. తనకెందుకు నోటీసులివ్వలేదనుకున్నాడో. మొన్న రఘునందన్‌రావు. దుబ్బాక నుంచే అసలు ట్యాపింగ్ వ్యవహారం మొదలైంది.. నాకెందుకు రాలేదు నోటీసులు..? అన్నాడు. అంటే అట్లుంది సిట్ పిలుపు ఇంపార్టెన్స్. ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారో వారంతా వీఐపీలు… వేరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నమాట. రానివారికి అంత సీన్ లేదన్నమాట. అందుకే నాకు రాలేదు.
నాకు రాలేదని, నా ఫోన్ ట్యాపింగ్ అయ్యిందంటే నాదని ఒకరికి మించి ఒకరు పోటీలు పడి మరీ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కానీ ఎవరిని పడితే వారిని పిలిచేందుకు సిట్‌కేమైనా పనిలేదనుకుంటున్నారా..? వార్త వైరల్ కావాలంటే.. ఫేమస్ వ్యక్తులనే ఎంచుకోవాలె. ప్రపంచానికి తెలియజెప్పాలె. రచ్చరంబోలా చేయాలె. కంపుకంపు చేసి.. విస్తృతంగా దీనిపై చర్చ.. అదే సీఎం అన్నట్టుగా కల్లు కాంపౌండ్‌లో కూడా చర్చ జరగాలె. అదే కదా సిట్ టార్గెట్. ఇదప్పట్లో ఒడవదు. ఫోన్ ట్యాపింగ్ ఓ ఒడవని ముచ్చట. సాగి సాగి జీడిపాకం సీరియల్ లా దీన్ని ఇంకెన్ని రోజులు నడిపిస్తారో తెలియదు. కాబట్టి మనకూ ఆమధ్యలో చాన్స్ రావొచ్చేమో. మనకు నోటీసులు ఇవ్వొచ్చేమో. ఏమో గుర్రం ఎగురానూవచ్చూ. అయినా మాకెందుకిస్తారులే నోటీసులు.. అని మాత్రం అనుకోకోండి. ప్రస్తుతానికైతే సామానులు బాగున్నవారికే నోటీసులిస్తున్నారు వాళ్లు. ఆ తరువాత మనమన్నమాట.