(దండుగుల శ్రీనివాస్)
తను అనుకన్నది చేసే వరకు వదలడం లేదు సీఎం రేవంత్‌రెడ్డి. జగమొండిగా పాలనను ముందుకు సాగిస్తున్నాడు. ఆది నుంచి ఆయన వైఖరి అలాగే ఉంది. హైడ్రా విషయంలో కూడా దూకుడుగా పోయి తరువాత కొంత వెనకడుగు వేసినా.. ఆ తరువాత ఆయన తన మార్కు పాలన కోసం తండ్లాడుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా రేవంత్ మళ్లీ కంచ గచ్చిబౌలి విషయంలో తన స్టాండ్ మార్చుకోలేదనే విధంగా కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం బద్నాం అయ్యింది. దీనిపై రాజకీయాలకు అతీతంగా ఒక్కటయ్యారు.
ఆ భూముల్లో వన్యప్రాణులున్నాయని, ఆ చెట్లను నరకొద్దని హై కోర్టు కూడా జోక్యం చేసుకుని మొట్టికాయలు వేసినా.. రేవంత్ మదిలో మాత్రం ఆ భూముల అంశం పోలేదు. వాటిలో ఐటీ టవర్లు నిర్మించి ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మళ్లీ ప్రకటించాడాయన. దీంతో పాటు శంషాబాద్ విమానాశ్రయం అవతల మరోమ 30వేల ఎకరాల్లో కూడా భారత్ ఫ్యూచర్ సిటీ కోసం ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించాడు. తన హయాంలో ఎప్పటికీ గుర్తుండి పోయేలా.. రేవంత్ ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటన్నాడనిపిస్తోంది.
రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న రేవంత్., ఐటీ పరిశ్రమల స్థాపన ద్వారా రియల్ రంగాన్ని దూకుడుగా ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ పేరుతో ఆయన అక్కడ నిర్మాణాలు చేపట్టినా.. అది పెద్దగా ముందుకు సాగడం లేదు. దీనిపైనా తాజాగా అధికారులతో సమావేశం పెట్టి దిశానిర్దేశం చేశాడాయన. ఇప్పుడు మళ్లీ కంచ గచ్చిబౌలి భూములతో పాటు, మరో 30వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అంకురార్పణ చేస్తున్నాడు. బీఆరెస్ ఏదైతే వద్దని రాజకీయం చేస్తున్నదో.. దాన్ని ఆయన తిప్పికొట్టేక్రమంలో మొండిగా ముందుకే పోతున్నాడనిపిస్తోంది.