(దండుగుల శ్రీనివాస్)
కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పట్నుంచి ఇదే మొదటి సారి. రైతు భరోసా నిధులు ఆగకుండా వరుసపెట్టి రప్పారప్పా పైసలు ఖాతాల్లో జమ కావడం. ఆది నుంచి ఈ పథకానికి ఆటుపోట్లే. ప్రధానంగా నిధుల లేమితో వివిధ కారణాలు, సాకులు చూపుతు సర్కార్ ఈ నిధులను రైతులకు పూర్తి స్థాయిలో అందించకుండా ఎగ్గొడుతూ వస్తోంది. కమిటీ పేరుతో మొదటి సంవత్సరం ఎగ్గొట్టింది. ఆ తరువాత క్లారిటీ ఇచ్చి.. ఇగ వేస్తున్నాం అని చెప్పి మూడెకరాలకే సరిపెట్టింది. ఆ తరువాత దాన్ని ఆపేసింది.
ఇగో ఇప్పుడు మల్లా మొదలు పెట్టింది. కానీ ఈసారి చెప్పింది చెప్పినట్టుగానే మొదలు పెట్టిన దగ్గర్నుంచి రప్పారప్పా పైసలైతే ఖాతాల్లో పడుతున్నాయి. సీఎం చెప్పినట్టుగా తొమ్మిది రోజుల్లో రూ. 9వేల కోట్లు వేస్తామన్నారు.. ఇగ వేస్తున్నారు. ఇప్పటికే నాలుగు రోజుల్లో 1.06 కోట్ల ఎకరాల పరిధిలో ఉన్న 62 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు 6వేల చొప్పున రూ. 6, 405 కోట్లు ఖాతాల్లో జమ చేసింది సర్కార్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1.49 కోట్ల ఎకరాల వరకు సాగుయోగ్యమైన భూములన్నాయని సర్కార్ గుర్తించింది.
వీటి కోసం ఏటా ప్రతీ సీజన్‌కు రూ. 9వేల కోట్లు అవసరం పడతాయని లెక్కలేసింది. ఇప్పుడు ఇది వరుస పెట్టి ఒక ఎకరం నుంచి మొదలు పెట్టి వరుసగా ఎకరాలను పెంచుతూ ఇస్తూ పోతున్నారు. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్నవారికి వేసేశారు. ఇక ఐదెకరాల పైన.. ఉన్న రైతులందరికీ వేయనున్నారు. దీనికి మరో ఐదు రోజులు గడువు పెట్టుకున్నారు. ఈ గడువులోగా 43 లక్షల ఎకరాల పరిధిలోని 8 లక్షల మంది రైతులకు రూ. 4, 600 కోట్ల రైతు భరోసా పైసలు జమ చేయనున్నారు.
ఇన్ని రోజులు ఆపి ఇబ్బంది పెట్టినా.. ఈ వానాకాలం సీజన్లో సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించడంతో రైతులకు ఎంతో ఊరటగా ఉంది. రైతాంగం హర్హం వ్యక్తం చేస్తోంది. ఇది ఎన్నికల స్టంట్‌గా కాకుండా ఎప్పుడూ సీజన్‌కు ముందే రప్పారప్పా పైసలు ఖాతాల్లో వేయాలని కోరుకుంటున్నారు.