వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్:
రాను బొంబయికి రానూ.. అన్నట్టుగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మీద అలిగిండు. అలకపాన్పెక్కి ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా.. బుజ్జగించి లాలించిన బుంగ మూతి వీడటం లేదు. ఏహె ఇగ నేను అటు (బోధన్, నిజామాబాద్) రానే రాన్రా బై.. ఊకె సతాయించకుండ్రి నా దగ్గరికొచ్చి… అని తన వద్దకు వచ్చిన నేతలకు కసురుకుంటున్నాడట. సీఎంకు దగ్గర బంధువు, కష్టకాలంలో ఆయన్ను ఆదుకుని వెన్నుదన్నుగా ఉన్నోడు.. ఇక పై ఎన్నికల్లో పోటీ చేయను .. ఇదే లాస్ట్ అని తెగేసి ధైర్యం చేసి చెప్పినోడు.. ఇన్ని చేసినా మంత్రి పదవి రాకపాయె. కచ్చితంగా… ఖ…ఖ్ఖచ్చితంగా వస్తుందని ఆశపెట్టి.. ఊరించి.. ఊయలలూగించి మునగ చెట్టెక్కించి దబ్బున కింద పడేశారు.
అసలే ముసలి పానం. ఇంతన్నా జాలిలేదు ఢిల్లీ పెద్దలకు. హోం మినిస్టర్ తనకే అన్నారు. అది లేదు ఇది లేదు. ఇప్పుడు కూడా అంతా అదే చెప్పి బుజ్జగిస్తున్నరు. అరే హోం మినిస్ట్రీ ఎవలకియ్యలే కాక.. అది నీకే.. నీకోసమే ఓరకవెట్టిండు మన సీఎం సాబు..! అని చెబుతున్నా… నమ్మలనిపించడం లేదు ఆ పెద్దాయనకు. దెబ్బతిన్న పానం కదా. నమ్మి మోసిపోయిన సందర్భం కదా. అందుకే వాళ్లిచ్చే దాకా నేను మాత్రం రానుపోన్రిరా బై.. చల్‌పుట్ అంటుండంట.