(దండుగుల శ్రీనివాస్)
ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారిన మంత్రుల తీరును గాడిలో పెట్టే పనిలో పడ్డాడు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఎవరి నోటి వెంట ఏం కామెంట్ వస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరెప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి ఏం మాట్లాడతారో ఆ క్షణం వరకు ముందు సమాచారం ఉండదు. పార్టీలో ఎంత స్వాతంత్రమున్నా ఇలా విచ్చలవిడిగా మాట్లాడే విధానం ఇప్పుడు మరింత ఎక్కువైంది. దీన్ని కంట్రోల్‌లో పెట్టేందుకు మహేశ్ రంగంలోకి దిగాడు.
నిన్న ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన పొంగులేటి .. అక్కడి నాయకులతో మాట్లాడుతూ ఈనెలాఖరు నాటికి లోకల్ బాడీ ఎన్నికలొస్తాయని, మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలుంటాయని చెప్పుకొచ్చాడు. ఇదే అంశాన్ని తీసుకుని ఇవాళ కేటీఆర్ ఓ వైపు, కవిత ఓ వైపు ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి ఏం తేల్చకుండానే ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని కవిత… రైతుబంధు ఎన్నికల స్టంట్‌గా మారిందని, త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేందుకే ఇప్పుడు రైతుబంధు మాట తీస్తున్నారని విమర్శించారు.
దీంతో పాటు పొంగులేటి ఇలాంటి కీలక ప్రకటనలు ఎలా చేస్తాడని, సీఎంతో కనీసం చర్చించకుండా, కేబినెట్ మీటింగులో చర్చించకుండా ఎట్లా చెబుతారని కస్సుమన్నాడు మహేశ్. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలపై ఇకపై ఎవరూ ఏం మాట్లాడొద్దని, సమయం వచ్చినప్పుడు ప్రభుత్వమే చెబుతుందని ఆయన కంట్రోల్‌లో పెట్టాడు. ఇప్పుడిది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.