(దండుగుల శ్రీనివాస్)
ఆంధ్రలో అంతే. ఆంధ్రలో అంతే. రాజకీయాలక్కడ డిఫరెంట్. మీడియా పాత్ర కూడా ఓవరాక్షన్. అది తెలంగాణకూ అంటుకున్నది అది వేరే విషయం. మనవాళ్లు నేర్చుకున్నవన్నీ ఆంధ్ర నుంచే కదా. అందుకే ఆ కంపు తెలంగాణ రాజకీయాలు, మీడియాలో కూడా ఉంది. ఈ రెండింటివి విడదీయరాని బంధం. ఓ మీడియా సంస్థ రన్ అవుతుందంటే దానికి ఒక రాజకీయ పార్టీ సపోర్టు కంపల్సరీ. బొక్కలో మెడలో వేసుకోవడం సహజంగానే మన మీడియాకూ అలవాటైంది. ఏమన్నా అంటే మీడియా విలువలు. జర్నలిస్టులపై దౌర్జన్యం. సీఎం రేవంత్రెడ్డి కూడా అన్నాడు. ఎవడిని జర్నలిస్టు అనాలో.. ఎవడు పడితే వాడే గొట్టం పట్టుకుని వాగేస్తున్నాడని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది వారికి పెద్ద ప్రాబ్లెం కాదు. అసలు సమస్యలాగే అనిపించదు. అవసరమైతే వాటిని పెంచి పోషిస్తారు. రెచ్చగొడతారు. అధికారంలోకి రాగానే అవే పెద్ద తలనొప్పులుగా మారుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆంధ్ర రాజకీయాల గురించి.
సాక్షి టీవీలో ఓ ఇంటర్వ్యూ. సహజంగానే తమకు కావాల్సిన కంటెంట్ రాబట్టుకునేందుకు అలాంటి వారినే చర్చలోకి లాగుతారు. వారికీ తెలుసు. సాక్షికేం కావాలో.. ఎవరి ఎలా తిట్టాలో..? వచ్చిన అథితులూ సోయి మరిచి ఇలా అమరావతిని వేశ్యా వాటిక చేసేశారు. దీనికి ఆ వృద్ధ జంబూక యాంకరు కూడా ముసిముసిగా నవ్వాడు. బలే అన్నాడే అనుకున్నాడు. ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ సమర్థించాడు. ఔఔ కరెక్టే నేను కూడా విన్నా.. ఎక్కడో చదివినా అన్నాడు. అంతిమంగా అమరావతి చుట్టుపక్కల అంటే అమరావతే ఓ వేశ్యల కొంప చేసేశారు. ఇది జగన్కు మాంచి మజాను ఇచ్చి ఉండవచ్చు. కానీ అక్కడున్న అధికార పక్షానికి మండింది. మీదో మీడియా మీదో వేషం అని లోపేలేశారు వృద్ధ జంబూకాన్ని.
దీనికి సాక్షి నిరసన. పాపం. తప్పుదు కదా. జీతాలు తీసుకుంటున్నారు. ఏదో ఒకటి చేయాలే. మీడియాను ఇంత ఖర్చు పెట్టి రన్ చేస్తుందే ఇందుకోసం. మీ పత్రిక విలువలు, మీ జర్నలిస్టు సిద్దాంతాలన్నీ పాత చింతకాయ పచ్చడి.. ఎవడికి కావాలోయ్..! మా రాజకీయాలు, మా రాజకీయ ఫ్యాక్షనిజాలు, మా రాజకీయ మీడియా కంపు కొట్లాటలు.. మా కులగజ్జి రాజకీయాలు మాకు ముఖ్యం. అందులో మీరంతా సమిధలు. మీకు మేము పెట్టిన పేరే మీడియా. అదే సాక్షి.. ఇంకా ఆనాడు, ఈనాడు, అంధజ్యోతి.. ఇవన్నీ కూడా.