(దండుగుల శ్రీ‌నివాస్‌)

పాల‌మూరంటే త‌ట్ట‌, మ‌ట్టి, పార ప‌నిచేసేటోళ్లే అనుకుంటున్న‌రు. కానీ ఇక్క‌డి నుంచి సీఎంగా ఎదిగి దేశమే శ‌భాష్ అనే స్థాయిలో పాల‌న కొన‌సాగిస్తున్నామ‌న్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. అచ్చంపేట బ‌హిరంగ‌స‌భ‌లో సీఎం మాట్లాడాడు. మ‌ళ్లీ లోక‌ల్ స్పీచే ఇచ్చాడు. మ‌హిళ‌లే కాంగ్రెస్ పార్టీకి అండ అన్నాడు. ఫ్రీబ‌స్సు ప‌థ‌కం ద్వారా ఏడాదిన్న‌ర‌గా రూ. 5500 కోట్లు ప్ర‌భుత్వం ఆర్టీసికి బాకీ ప‌డింద‌న్నాడు. ఇదంతా మ‌హిళ‌ల కోస‌మే చేస్తున్నామ‌న్నాడు. కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తామ‌ని, యావ‌త్ తెలంగాణ త‌మ స‌ర్కార్‌కు అండ‌గా నిల‌బ‌డాల‌ని ఆకాంక్షించాడు. క‌డుపులో విషం పెట్టుకుని త‌న మీద‌, స‌ర్కార్ మీద ఎంత దుమ్మెత్తిపోసినా పాల‌మూరు బిడ్డ‌గా సీఎంగా చేస్తున్న మంచి ప‌నులు, ప్ర‌జ‌ల ఆశీస్సులు త‌న‌కు అండ‌గా ఉంటాయ‌న్నాడు.

ఇంకా ఏమ‌న్నాడంటే…

నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చాన‌ని, ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాన‌న్నాడు. పోడ భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిదన్నాడు. పోడు భూముల్లో సోలార్ పంపుసెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత త‌మ ప్ర‌భుత్వాన్నిద‌న్నాడు. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపుసెట్లు అందిస్తాన‌న్నాడు సీఎం. తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామ‌న్న సీఎం.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏడాదిలో 60 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టామ‌న్నాడు. నిత్యావసర ధరలను నియంత్రించి పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశాడు. శాంతిభద్రతల పరిరక్షణలోనూ తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నాడు. పాలమూరోల్లకు పాలన చేతకాదన్న వాళ్లకు.. తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టగలమని నిరూపించామ‌న్నాడు. కొంతమంది తమ అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌నుద్దేశించి అన్నాడు రేవంత్‌. కడుపునిండా విషం పెట్టుకుని త‌న‌పై విష ప్రచారం చేసే వారిని నేను పట్టించుకోనన్నాడు. పేదల ఆకలి తీర్చే రేవంతన్న సన్న బియ్యం మేమేం చేస్తున్నామో గుర్తు చేస్తుంద‌న్నాడు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మన పథకాలే ప్రజలకు నిజాలను చెబుతాయని, త‌మ‌పై తప్పుడు ప్రచారం చేసేవారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.