(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
9949774458
ఇది యుద్దాల శకం కాదు. అభివృద్ధికి పోటీ పడే శకం. టెక్నాలజీ యుగం. ప్రజలు నష్టపరిచే యుద్ధాలను కోరుకోవద్దు. ఇదన్నది ఎవరో కాదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఉక్రెయిన్, రష్యా యుద్దాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. అది పదే పదే ప్రస్తావించారు కూడా.
పహల్గాం దారుణ మారణకాండ తరువాత కూడా నరేంద్ర మోడీ అదే సంయమనం పాటించాడు. ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రపంచం ఊహించని విధంగా అనూహ్యమైన రీతిలో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేశారు. నిమిషాల్లో నిర్ధేషిత లక్ష్యాన్ని చేధించి పాక్ భూ భాగంలో ఉగ్రవాదులను మట్టుబెట్టి ఎలాంటి కష్టం నష్టం లేకుండా తిరిగి రావడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అమెరికా ట్విన్ టవర్స్ పై .. అంటే అగ్రరాజ్యం గుండెపై తన్నినట్టు ట్విన్ టవర్స్‌ను కూలగొట్టి దారుణ మారణకాండకు పాల్పడ్డ అంతర్జాతీయ ఉగ్రవాది ఒసమా బిన్ లాడెన్ ను అంతం చేయడానికి అమెరికా రాజ్యానికి పదేండ్లు పట్టింది. అది కూడా పాకిస్థాన్ గడ్డపైనే తుదముట్టించడం ఇక్కడ విశేషం. పాకిస్థాన్ భూ భాగంలో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన క్రమంలో పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగడం .. భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టడంతో యుద్ధ వాతావరణమే నెలకొన్నది. ఈ యుద్ధం తీవ్రమై ప్రపంచానికే ముప్పు తెస్తుందోమోనన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అటు అగ్రరాజ్యం, ఇటు చైనా కూడా డిఫెన్స్‌లో పడ్డాయి. భారత ప్రజలు కూడా చాలా మంది ఒకసారి వేసేస్తో పోలా అన్నట్లు బేజారెత్తిపోయారు. యుద్ధానికి సిద్ధమన్నట్టు సామన్య ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది.
కానీ, మోడీ ప్రభుత్వం కానీ సైన్యం కానీ మొదటి నుంచి యుద్దం అనే పదం ఎక్కడా వాడలేదు. పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాదాన్ని అంతం అనే పంతం తప్ప ఎక్కడా కూడా యుద్ధం అనే పదం వాడలేదు. అది చాలా మంది గమనించాల్సిన అంశం. పాక్ స్పాన్స్‌ర్డ్ ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు ఖతం చేసుకుంటూ పోతే యుద్ధంలో గెలిచినట్టేనని మోడీ ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తోంది. అంతర్గత ఆర్థిక సంక్షోభంతో, శాంతి భద్రతల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ఆత్మహత్య దిశలో పోతున్నదని దాని పై యుద్ధం చేయడం ద్వారా అభివృద్ధి దిశలో ఉన్న భారత్‌కు ఎంతో కొంత నష్టం తప్పదని మోడీ ప్రభుత్వానికి తెలుసు. ప్రజల భావోద్వేగాలను ఆసరా చేసుకుని యుద్ధం చేసుకోవడం తగదని మోడీ సంయమనం పాటించాడు. ఒక్కసారి పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే అది ఎక్కడ అంతం చేయాలో.. ఎక్కడా పుల్ స్టాప్ పెట్టాలో తెలియని పరిస్థితి ఉంటుంది.
అన్ని ధ్వంసమైయిన తరువాత చెట్టుకిందో ఇంకా ఎక్కడో కూర్చోని మాట్లాడుదాం అనడం పరిపాటి అవుతోంది. పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు అప్పుడు అగ్రరాజ్యం, చైనా వంటి దేశాలు యుద్ధం పై చలికాచుకున్నట్టు మధ్యవర్తిత్వం వహించడం …అపార నష్టం తరువాత చర్చలు జరగడం వంటి పరిణామాలను ముందుగానే మోడీ ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే అవినీతి బురదలో , అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌పై దాడి చేస్తే గెలుపు చివర భారత్‌దే అవుతుంది. కానీ అపారనష్టం కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది. తరువాత జనంపైనే పన్నుల భారం వేయాల్సి వస్తుంది. కాస్త ఆలోచిస్తే రెండు దేశాలు తీసుకున్న నిర్ణయం చాలా మంచింది. ఈ విషయాన్ని చిదంబరం లాంటి వ్యక్తలు కూడా ప్రశంసించారు. కానీ అమెరికా చెబితే విన్నారు.. అని రాహుల్ గాంధీ లాంటి వారు విమర్శలు చేయడానికి అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఆపరేషన్ సిందూరు సక్సెస్ కావడం యుద్ధం అపారనష్టం లేకుండా అప్రకటిత యుద్ధం ముగిసిపోవడం శుభపరిణామమేనే చెప్పవచ్చు. కానీ తీవ్రమైన ఆవేశంతో ఉన్నవారికి ఇది కొంచెం రుచించకపోవచ్చు. కానీ యుద్దం వాంఛనీయం కాదనే సత్యం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోవాల్సిందే.
ట్రంపు చెబితే అర్థంతరాంగా ఆపుతారా అని ప్రతిపక్షాలు పార్లమెంటులో ధ్వజమెత్తే అవకాశాలున్నాయి.