(దండుగుల శ్రీ‌నివాస్‌)

అస‌లే బ‌డ్జెట్ బాగ‌లేదు. అప్పులు, మిత్తీల‌కే స‌రిపోతుంది. జ‌ర ఆలోచించిండ్రి. కేసీఆర్ చేసిన పాపాలు నేను బ‌లైపోతున్నా.. స‌మ్మె వ‌ద్దు గిమ్మె వ‌ద్దు. ఆలోచించిండ్రి. చ‌ర్చించుకుందాం… రండ్రి.. అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చినా ..ఎవ‌రూ త‌గ్గ‌ట్లేడు. పైపైచ్చు స‌మ్మె ఘీంకారాలు మ‌రింత పెరుగుతున్నాయి. వెన‌క్కి త‌గ్గేదేలేదంటున్నాయి ఆర్టీసీ వ‌ర్గాలు. ఇది చాల‌దంటూ తాజాగా ఎంప్లాయిస్ జేఏసీ కూడా ఆందోళ‌న‌ల‌కు దిగుతామ‌ని పిలుపునిచ్చింది. వ‌రుస ఆందోళ‌న‌ల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ల‌క్ష‌లాది మంది ఉద్యోగుల‌తో మ‌హాధ‌ర్నా నిర్వ‌హించేందుకు డేట్ ఫిక్స్ చేసింది. అయినా విన‌వా..? అయితే పెన్‌డౌన్ చేయ‌డానికి కూడా వెనుకాడం ఇగ జూస్కో అని అల్టిమేటం జారీ చేసింది. ఓ వైపు ఆర్టీసీ. మ‌రోవైపు ఉద్యోగ జేఏసీ. మ‌ధ్య‌లో మ‌న బ‌డ్జెట్ ప‌ద్మానాభం ల‌బోదిబోమంటున్నాడు. అవును..! మొన్న‌నే ఓ వేదిక మీద చెప్పిండు గుర్తింది క‌దా.

నేనిప్పుడు బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం సినిమాలో హీరో జ‌గ‌ప‌తిబాబు లెక్క పొదుపు లెక్క‌లేసుకుంటున్నా అని. స‌మ్మె వ‌ద్దు రా బై… నెత్తినోరు కొట్టుకున్నా.. విన‌డం లేదు. ఆర్టీసీ, ఉద్యోగ జేఏసీ. ఎందుకంటే వారి మీద ఒత్తిడి పెరుగుతోంది. ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్ స‌మ‌స్య‌లు. ప‌రిష్క‌రించే దిక్కు లేదు. పోయిన కేసీఆర్ కుప్ప చేసిండు. ఇప్పుడున్న రేవంతు .. పాత పాపాలే లెక్క‌లేసుకుంటూ అవే ముచ్చ‌ట్లు వ‌ల్లేవేసుకుంటూ కాలం గ‌డుపుతున్న‌డు. ఊ అంటే కేసీఆర్ జ‌ప‌మే చేస్తుండు. ఇంకెన్నొద్దులు చెప్త‌వ్ రా గీ ముచ్చ‌ట్లు అని ల‌క్ష్మీ సినిమాలో తెలంగాణ శకుంత‌ల వేణుమాధ‌వ్‌ను అన్న‌ట్టుగా మ‌న జ‌నాలు కూడా రేవంత్‌ను ఇట్ల‌నే అంటున్నారు.

05Vastavam.in (4)

ఇగ కేసీఆర్‌ను తిట్టుడు బంజేసి మాకు అక్క‌ర‌కొచ్చే ప‌నులు, మా అవ‌స‌రాలు తీర్చే ప‌నులు చేయు. నిన్ను తెచ్చుకుందే అందుకాయె.. అని బాజాప్తా చెబుతున్నారు. అనుకుంటున్నారు. ఉద్యోగ జేఏసీ విడుద‌ల చేసిన ప్రెస్‌నోట్‌లో నైతే మాతో పెట్టుకోకు రేవంత్‌.. కేసీఆర్ మ‌ట్టిక‌రిచాడు. నీకు అదే గ‌తి ప‌డుతుంద‌నే విధంగా ప‌రోక్ష వార్నింగ్ కూడా ఉంది. ఇదేంది… చీక‌ట్లు త‌రిమేస్తే వెలుగు రావాలె కానీ ఇంకా చీక‌ట్లోనే ఉన్నాం…అని కూడా అభివ‌ర్ణించేశారు. అంతేకాదు తెలంగాణ చ‌రిత్ర‌లో ఇలా నిర్ల‌క్ష్య దోర‌ణి, అహంకార‌పూరిత చ‌ర్య‌లు, ప‌ట్టింపులేనిత‌నం, ఆత్మ‌గౌర‌వం కించ‌ప‌రిచే కార్య‌క్ర‌మాలు చేస్తే ఊరుకునే ప‌రిస్థితి ఉండ‌ద‌ని ఓసారి గుర్తు చేశారు. జాగ్ర‌త్త రేవంతు..! అని కూడా హితోక్తులు ప‌లికారు. ఇలా ఉంది వీరి ముచ్చ‌ట‌. ఇగ ఆర్టీసీ వాళ్ల‌దైతే గోస చెప్ప‌న‌ల‌వికాదు. పాపం.. అతి త‌క్కువ వేత‌నాల‌కే ప‌నులు చేస్తూ గొడ్డు చాకిరి చేస్తున్నా గుర్తింపు లేదు.. ప‌ట్టింపులేదు అనే విధంగా త‌యార‌య్యింది వారి ప‌రిస్థితి.

కేసీఆర్ ఆర్టీసీ ప్ర‌భుత్వంలో విలీనం చేస్తాన‌ని ఒట్టి మాట‌లు చెప్పి సంబురం చేసుకోమ‌న్న‌డు. ఆయ‌న గ‌ద్దె దిగుండు. అదే అటే పోయింది. ఇప్పుడున్న రేవంతు అస‌లు ఆ ముచ్చ‌ట తీస్తందుకే ఇష్ట‌ప‌డ్త‌లేడు. ఇక ఇదే ప్ర‌ధాన డిమాండ్‌తో స‌మ్మెకు దిగుతుండ్రు ఆర్టీసీ కార్మికులు. కానీ రేవంత్ మాత్రం వీరి డిమాండ్లు, స‌మ‌స్య‌లు వినే ప‌రిస్థితిలో లేడు. విన్నా తీర్చే ప‌రిస్థితి అక్క‌డ లేదు. అందుకే బ‌తిమాలుతున్నాడు. బామాలుతున్నాడు. అంతేత‌ప్ప ఇంకో ముచ్చ‌ట లేద‌క్క‌డ‌. వినాల్సిందే. అంత‌కు మించి వీరూ చేయాల్సిందేమీ లేదు. ఏవో చ‌ర్చ‌ల పేరు బుజ్జగించే ప‌ని చేస్త‌రు. అన్ని వాయిదా తీర్మానాలే. స‌త్వ‌ర ప‌రిష్కారాలుండ‌వు. ఇదే జ‌ర‌గ‌బోతుంది.

 

బీఆరెఎస్ సైలెంట్ మోడ్‌…!

ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో బీఆరెస్ సైలెంట్ మోడ్‌లో ఉంది. వాళ్లు మాట్లాడ‌టానికి అక్క‌డ ఏం లేదు. కేసీఆర్ ఎంత డ్యామేజీ చేయాలో అంత చేసి పోయిండ‌నే కోపంతో ఆర్టీసీ కార్మికులున్నారు. ఆర్టీసి సొమ్మును కూడా వాడుకున్నాడ‌నే ఆగ్ర‌హం ఉండ‌నే ఉంది. ఇప్పుడు ఈ స‌మ్మెకు వారి సంఘీభావం ఇచ్చేలా లేరు. వీరు తీసుకునేలా లేరు. కానీ క‌డుపు చించుకుంటే కాళ్ల మీద ప‌డుతుంద‌న్న‌ట్టుగా ఆర్టీసీ కార్మికుల వెత‌లు అంతా ఇంతా కావు. అవి తీర్చాల్సిందే. కానీ తీర్చ‌లేని ప‌రిస్థితి. స‌మ్మెకు పోతేనే బాగుంటుంది. స‌ర్కార్‌కు బుద్దొస్తుంద‌ని అనుకుంటున్నా.. సమ‌స్య మ‌రింత జ‌ఠిల‌మ‌వుతుంద‌నే భ‌యం కార్మిక వ‌ర్గాల్లో ఉంది. దీంతో సీఎంతో స‌యోధ్యే త‌ప్ప యుద్దం చేసేలా లేరు. దీంతో చ‌ర్చ‌ల పేరుతో స‌మ్మెను చ‌ల్ల‌బ‌రిచేలా చేయ‌నుంది స‌ర్కార్. అందుకే బీఆరెస్ కూడా సైలెంట్‌గా అన్నీ గ‌మ‌నిస్తోంది. అంతే త‌ప్ప ఎక్క‌డా ఏం మాట్లాడ‌టం లేదు. ఆర్టీసీ కార్మికులు కూడా బీఆరెస్ జోలికే వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. వారి నీడ ప‌డ్డా వీరి స‌మ‌స్య‌లు ఇక మ‌రిన్ని పెరుగుతాయి త‌ప్ప త‌గ్గ‌వ‌ని వారికి తెలుసు.

 

బుజ్జ‌గింపులే… వ‌డ్డింపులు లేవు..!

ముందే చెప్పాడు సీఎం.ఇప్సుడు న‌డిచే సినిమా బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం. ఎవ‌రెన్ని అన్నా వ‌డ్డింపులైతే ఉండ‌వు. ఓన్లీ బుజ్జ‌గింపులే. అది ఆర్టీసీ అయినా. ఉద్యోగ జేఏసీయైనా. పిలిచి మాట్లాడ‌టం వ‌ర‌కు ఓకే. డిమాండ్ల సాధ‌న ఉత్త ముచ్చ‌టే. పోనీ ఆర్థిక భారం కానివి కొన్నైనా చేసి పెట్టండి అని లోలోప‌ల బ‌తిమాలుకున్నా.. స‌ర్లే చూద్దాం లే… అనే వాతావ‌ర‌ణ‌మే ఉంద‌క్క‌డ‌. అంత‌కు మించి పెద్ద అంచ‌నాలు లేవు. ఇప్పుడే వ‌చ్చాం. అప్పుడే ఇబ్బందులా..? స‌ర్కార్ ఆలోచ‌న ఇలాగే ఉంది. ఇది సమ్మె చేసే ఆర్టీసికి. పెన్‌డౌన్ చేసే ఉద్యోగుల‌కూ వ‌ర్తిస్తుంది. మొన్న‌టికి మొన్న‌నే సీఎం అన్న‌డు.. కేసీఆర్ వ‌రంగ‌ల్ స‌భ పెట్టి మా మీద విషం చిమ్మాడు. వ‌చ్చి ఏడాదే అయింది. ఏవైనా స‌ల‌హాలివ్వాలె గానీ, ఇలా పిల్లి శాపాలు పెడ‌తాడా..? అని. ఇప్ప‌డు వీరికి అదే చెప్తాడు. కొంచెం ఓపిక ప‌ట్టండ‌ని. కొంచెం అంటే సీఎం రేవంత్ ప‌రిభాష‌లో ఓ ఏడాద‌న్న‌మాట‌.

Dandugula Srinivas

8096677451

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed