(దండుగుల శ్రీనివాస్)
పదేళ్లూ పట్టించుకోలే. ఉద్యమ సమయంలో అన్నీ కష్టాలే. కేసులే. ఆనాడు పెండ్లాం పిల్లలను పట్టించుకోకుండా, కుటుంబాలు ఏమై పోయినా చూసుకోకుండా పేగులు తెగేదాక కొట్లాడినం. తెలంగాణ తెచ్చుకోవాలంతే. దాని కోసం ఏమైనా చేద్దామనే పోరాటం పటిమ. అదే కదా కేసీఆర్ వెంట నడిపించింది. ఆ తరువాత ఏమైంది. తెలంగాణ వచ్చింది. ఇగ బతుకులు బాగుపడ్డట్టేననుకున్నం. టీఆరెస్సూ అధికారంలోకి వచ్చింది. ఇక కష్టాలే ఉండవనిపించింది. కష్టాలు, నష్టాలన్నీ పోతాయని గంతులేసినం. ఏమైంది. కష్టపడ్డోడు అట్లనే ఉన్నడు. ఎవడో వచ్చి అధికారం చేజిక్కించుకున్నడు. వాడు ఆడిందే ఆట. కేసీఆర్ చెప్పిందే పాట.
కుక్కల కన్నా హీనంగా బతుకులు. మరింత కష్టంగా కుటుంబాలు. ఇంకా చేస్తారేమో..! మన కోసం ఆలోచిస్తరేమో..!! ఆశ చావలేదు. వేరే పార్టీలోకి పోయేందుకు మనసొప్పదు. కేసీఆర్ మీద కోపం తగ్గదు. కానీ వదలిపోలేని పరిస్థితి. అధికారం పోయింది. ఆ పదేండ్లూ మరింత నరకమే. పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా. ఇగో ఇప్పుడు కండ్లు తెరిచిండ్రు. ఉద్యమకారులే మా ఊపిరంటుర్రు. సెంటిమెంట్ మాటలు మళ్లా వినిపిస్తున్నాయి. ఒడ్డెక్కినంక ఫక్తు రాజకీయం అని మాట్లాడిన నెత్తిమీదికెక్కిన కండ్లు కిందికి దిగినయి అనిపిస్తుంది. భారీ బహిరంగ సభ. పెట్టిండ్రు. మంచిదే. సంపాదించిన పైసలు ఖర్చు పెడుతుండ్రు. అవన్నీ మా పైసలే. మాకు రావాల్సినవి. మేము బాగుపడటానికి ఉపయోపడే పైసలు.
పెద్దల గడ్దలు, దొరల పెద్దలు దోచుకుపోయిండ్రు. ఇప్పుడు పెడుతున్నరు. కడుపు నిండ కల్లు, చేతి నిండా డబ్బు. ఇప్పుడిస్తున్నరు. పదవులు ఇయ్యలే. ఆదుకోలే. ఇప్పుడు ఇట్లా సభలకు ఉపయోగపడుతున్నం. ఇలాంటి సభలు మళ్లీ మళ్లీ జరగాలె. కేసీఆర్ సంపాదించిన సొమ్మంతా బయటకు తీయాలే. మాకు ఖర్చు పెట్టాలె. ఇంకా మంచిగా బుద్ది రావాలంటే ఇంకోసారి కూడా ఓడిపోవాలె. అప్పుడు మా గురించి ఇంకా మంచిగా పట్టించుకోవాలె. అయినా మాసారు దగ్గర పైసలకు తక్కువ లేదు. నాలుగు టర్ములు ఓడినా ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తడు. కోట్లకు కోట్లకు తీస్తడు. ఇస్తడు. పెట్టిస్తడు. తియ్యాలె. ఇంకా తియ్యాలె. ఇయ్యాలె. మాకింకా ఇయ్యాలె. ఇసొంటి సభలు మళ్లీ మళ్లీ జరగాలె. మా కేసీఆర్ మళ్లీ మళ్లీ ఓడాలె.