(దండుగుల శ్రీనివాస్)
మంత్రివర్గ విస్తరణ పై ఇంకా టెన్షన్ కొనసాగుతోంది. ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.ఢిల్లీకి వెళ్లిన పెద్దలు తమ అభిప్రాయాలను చెప్పారు తప్పితే .. అధిష్టానం మాత్రం ఫైనల్ రిపోర్టు ఇవ్వలేదు. ఆ లిస్టును తమ వద్దే ఉంచుకున్నది. అసలు ఎవరెవరిని తీసుకుంటారో కూడా పేర్లు వెల్లడించలేదు.అందరూ చెప్పింది విన్నది. తిరిగి పంపించేసింది అధిష్టానం. షరా మూములగానే వేచిచూసే దోరణిని ఇక్కడ పార్టీ అవలంభిస్తోంది. ఈలోగా ఎవరి అంచనాలు వారు వేసుకుని పేపర్లలలో ఎవరికి తోచిన విధంగా వారు రాసుకున్నారు. తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్న విధంగానే వార్తలు వచ్చాయి. ఆశావహులు చంకలు గుద్దుకున్నారు.
ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ తనకు హోంమంత్రి ఇస్తే బాగుటుందని కూడా తన రిక్వెస్టు కమ్ ఆర్డర్ కమ్ డిమాండ్ చెప్పేశాడు. ఇదిలా ఉంటే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని ఒక్కడినే అధిష్టానం ఫైనల్ చేసింది. ఆయన పేరును వెల్లడించేసింది. మిగిలిన పేర్లలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్లు కూడా ఊహాజనితాలుగానే మిగిలాయి. ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్చేస్తారో తెలియదు. ఇద్దరికి మాత్రం వచ్చేలా లేదు చాన్స్. ఇద్దరికీ రాకపోయినా ఆశ్చర్యంలేదు. అంతలా సస్పెన్స్ కొనసాగుతోంది. విజయశాంతికి ఎమ్మెల్సీనే ఎక్కువని అనుకున్నారు. అంతా కస్సుమన్నారు కాంగ్రెస్ లీడర్లతో సహా.
ఇప్పుడు ఆమె పేరు కూడా మంత్రివర్గంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. దీన్ని కూడా కొట్టేయలేమంటున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఉగాది తరువాత ప్రమాణ స్వీకారం.. అంటూ ఏవేవో రాసుకున్నారు. కానీ అదిప్పట్లో ఉండేలా లేదు. ఎవరిని ఫైనల్ చేయాలో అధిష్టానందే ఫైస్లా. వారు ఎవరి పేర్లు చెప్తారోనని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకుని బహిర్గతం చేయడానికి వారం పదిరోజులు, ఆపై సమయం కూడా పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఆశావహులకు ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. ఫైనల్ లిస్టులో మాత్రం అధిష్టానం భారీ ట్విస్టులిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటి వరకు నానుతూ వచ్చిన పేర్లలో ఒక్క వాకిటి శ్రీహరి ముదిరాజ్ మినహా ఎవరి పేర్లు ఫైనల్ కాదు. వారికి అవకాశం ఇస్తారో లేదో కూడా తెలియదు.