(దండుగుల శ్రీనివాస్)
సోషల్ మీడియా అరాచకమన్నారు. హద్దుల్లేవన్నారు. నిజమే. సంచలనం కోసం పాకులాడుతుందన్నారు. వాస్తవమే. వ్యక్తిగతంగా ఎవరినైనా అప్రదిష్టపాలు చేసేందుకూ వెనుకాడటం లేదన్నారు. ఇది కరెక్టే. జర్నలిజం నిబంధనలు, షరతులు గాలకొదిలి బరిబాతల ఊరేగుతుందన్నారు. ఇదీ శుద్ద నిజమే. కానీ ప్రధాన మీడియా కూడా ఇలాగే ఊరేగుతున్నది. సోషల్ మీడియాతో పోటీ పడేందుకా..? కేసీఆర్‌ను తాగుబోతుగా రేవంతు తిట్టినందుకు అబ్బ.. శభాష్ ఏమన్నాడు రా… బాగుంది.. బాగు బాగు అని మనసు చల్లబడి అవే మాటల్ని అచ్చేసి ఆనందపడిపోవవడానికా.
మొత్తానికి అవే మాటలు అచ్చు గుద్దినట్టు వచ్చాయి ఆంధ్రజ్యోతిలో. మిగిలిన పేపర్లు సంయమనం పాటించాయి. సీఎం మాటల నిందారోపణల సారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నాయి. తాగుబోతోడు అనే పదాన్ని విస్మరించాయి. వదిలేశాయి. ఓ సీఎం స్థాయి వ్యక్తి కూడా బహిరంగ వేదికల మీద మాజీ సీఎంనుద్దేశించి తాగుబోతుడు… మందు వాసన చూడందే పొద్దున లేస్తడా.. ? అని ఆరోపణలు చేయడం మరీ దిగజారుడు తనమే సుమీ. ఎందుకంటే ఆ మాటల వెనుక మర్మం అర్థమవుతూనే ఉంది. కేసీఆర్‌ను డీమోరల్ చేయాలె. జనాలనుకోవాలె.. ఏమని…? అబ్బ కేసీఆర్ అంత తాగుబోతోడా..? అనే ముద్రపడాలె. దానివల్ల బీఆరెస్‌కు, కేసీఆర్‌కు జనాల్లో క్రేజ్ తగ్గాలె. జనం చీదరించుకోవాలె. ఛీ ఛీ అనుకోవాలె. కాంగ్రెస్‌కే పట్టం గట్టాలె. ఇంత పచ్చి నిజాలను చెప్పిన రేవంతునే సీఎం చేయలె.
అంతే కదా సీఎం సార్. దీనికోసం ఇంతగా దిగజారి మాట్లాడాలె. ఎందుకు తెలంగాణ జాతిపిత అనే విషయంలో చాలా మాట్లాడొచ్చు. దానికి తాగుబోతు అనే ముద్ర వేయాలా…? ఆరోపణలు మరీ శృతి మించకూడదు సారు..! మొన్ననే మీరే అన్నరు కదా…! వ్యక్తిగతమొద్దు.. కుటుంబ సభ్యులను లాగొద్దు.. మరీ పరుషపదజాలాల వాడి మనసు నొప్పించొద్దు… ఈ మాటలతో కేసీఆర్ మనస్సు చివుక్కుమనలేదా..? కేటీఆర్ భగభగామండిపోలేదా..? పార్టీలకతీతంగా మరీ ఇట్ల మాట్లాడిండేదబ్బా అని ముక్కున వేలేసుకోలేదా.??
అప్పుడు అధికారంలోకి వచ్చాక ఓకే…. ఏం మాట్లాడినా చెల్లుబాటయ్యింది. ఇప్పుడు మీరు సీఎం రేవంతు సారు..? ఇట్ల మాటలు చెబుతూ… తిట్టు తిడుతూ ….. బూతులు మాట్లాడుతూ ఎంతోకాలం పార్టీని, ప్రభుత్వాన్ని నడపలేరు. ఇది గమనించాలె. పత్రికలు కూడా సీఎం సారులెక్క కొంత సంయమనం వీడి .. బ్యాలెన్సు తప్పుతున్నాయనుకో. యథారాజా తథా పత్రికలు. అప్పుడు కేసీఆర్ పాట…. ఇప్పుడు రేవంతు బాట… అంతే..!