(దండుగుల శ్రీనివాస్)
సోషల్ మీడియానా మజాకా..! తప్పుల బొక్కలు లెంకడంలో మాకు సాటి మరి లేరనిపించుకుంది మరోసారి. తీన్మార్ మల్లన్న కు షోకాజ్ నోటీసును హడావుడిగా ఇచ్చేసి చేతులు దులుపుకున్నది టీపీసీసీ. కానీ ఆ కథ అంతటితో ఆగలేదు. ఇక అక్కడే మొదలైంది. ఈ సుధీర్ఘమైన లెటర్ అక్షరాల వెంట పరుగులు పెట్టారు కొందరు. బూతద్దాలు పట్టుకుని రంధ్రాన్వేషణ చేశారు. వారు ఆశించిందే జరిగింది. వారు దొరకాలని కోరుకున్న తప్పులు కుప్పలుతెప్పలుగా దొరికాయి. ఇంకేముంది. పాయింటవుట్ చేశారు. పాయింటు టు పాయింట్ శ్రద్దగా చదివారు. తప్పులున్న చోట రౌండ్ మార్కు చేశారు. అక్కడేం రావాలో.. దానికి బదులుగా ఏం రాశారో కూడా చెప్పేశారు.
మొత్తానికి దీనికి మార్కులు కూడా వేశారు. వెటకారంగా. మీకు షోకాజ్ నోటీసే ఇవ్వరాదు. ఇక మీరేం పాలన చేస్తారురా బై… అని కసిదీరా తిట్టిపోశారు. అవును.. మరీ ఇంత నిర్లక్ష్యమా..! ఈ ఇంగ్లీష్ గోలెందుకు..? సీఎం రేవంత్ సంస్కరణల్లో భాగంగా జీవోలు తెలుగులో వచ్చినట్టు ఆ గాంధీభవన్‌లో ఇంగ్లీష్ టైపులు మానేసి తెలుగులో కంపోజ్ చేసే వారిని పెట్టుకోరాదుర్రి. వామ్మో అదింకా డేంజర్ సుమీ..! తెలుగులో అక్షర దోషాల్లేకుండా టైపు చేయాలంటే మీ తరం కాదులెండి. అది మరింత నవ్వులపాలు చేస్తుంది. గ్యారెంటీ. కానీ ఈ టైపో మిస్టేక్‌లపై కాస్త దృష్టి పెట్టండి. నిష్ణాతులతో ఒకటికి రెండు సార్లు చెక్ చేయించుకున్న తరువాతే బయటకు వదలండి. లేదంటే సోషల్ మీడియాలో గాంధీ భవన్ నుంచి ఏ నోట్ రిలీజ్ అయినావ రెడీగా ఉన్నారు పెద్ద పెద్ద బూతద్దాలు పట్టుకుని. రంధ్రాన్వేషణ చేయడానికి.