(దండుగుల శ్రీనివాస్)
అప్పటిదాకా ఆమెకు తిరుగులేదు. కేసీఆర్ తనయగా, సీఎం బిడ్డెగా ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ తరువాత మకుటం లేని మహారాణి. ఇందూరుకు సీఎం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలను ఆమె ఒంటి చేత్తో శాసించింది. ఆమె చెప్పిందే అక్కడ వేదం. అలాంటి రాజకీయ వాతావరణంలో పెనుతుఫానులా వచ్చింది పసుపుబోర్డు అంశం. తొలిసారి బ్రహ్మాండమైన మెజారిటీతో నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తునే అగమ్యగోచరం చేసిందీ పసుపుబోర్డు. రెండోసారి ఎంపీగా నిలబడ్డ ఆమెను చిత్తు చిత్తుగా ఓడగొట్టి… అప్పటికి రాజకీయాల్లో అనామకుడైన అర్వింద్‌ను అందలమెక్కించిందీ పసుపుబోర్డే. సరే, వేర్వేరు కారణాలు ఏమున్నా.. కవితపై వ్యక్తిగత వ్యతిరేకత కొంత ఉన్నా.. ఎమ్మెల్యేల సహాయనిరాకరణ తోడైనా… అంతిమంగా పసుపు బోర్డు అంశం ఆమె రాజకీయ ఎదుగుదలకు గండి కొట్టింది. పెద్ద అగాధాన్నే ఏర్పరించింది.
రైతులంతా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. పసుపుబోర్డు విషయంలో కవిత ఏం చేయలేకపోయిందనే కోపంతో ఉన్నారు రైతులంతా. అందుకే ఆమెకు వ్యతిరేకంగానే పోటీలో నిలిచారు. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు అర్వింద్. ఓ బాండు రాశాడు. తను గెలవగానే ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెచ్చిపెడతానన్నాడు. అసలు తాను గెలుస్తాననే నమ్మకం వన్ పర్సెంట్ కూడా లేదు అర్వింద్‌కు. తను పోటీ పడుతున్నది సీఎం బిడ్డెతో. అది తెలుసు. గెలుపు అసాధ్యమని. కానీ ఏటికి ఎదురీదుతున్న అర్వింద్‌ను కొట్టుకుపోకుండా, కనుమరుగుకాకుండా ఆపింది పసుపుబోర్డు. అదే విజయతీరాలకు చేర్చింది. అదో చారిత్రక తీర్పులా నిలిచింది. ఇందూరు రాజకీయాల్లో సంచలనం, రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అప్పట్నుంచి కవిత పొలిటికల్ డౌన్ ఫాల్ మొదలైంది. అర్వింద్ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు… దేశ రాజకీయాల్లో కూడా ఓ మెరుపులా మెరిశాడు.
కానీ ఆ తరువాత పసుపుబోర్డు గురించి అతను చెప్పిన వాగ్దానం నెరవేర్చలేకపోయాడు. అది సాధ్యం కాదని అతనికి తెలిసిపోయింది. ఎదురుప్రశ్నించినోళ్లకు తిక్కతిక్క సమాధానాలే ఇచ్చాడు. తప్పించుకునే విధంగా వ్యవహరించాడు. కానీ రెండో సారి ఎంపీగా పోటీ చేసేందుకు బరిలో దిగితే అది పసుపుబోర్డు అంశం అర్వింద్‌ను వెక్కిరించింది. ఇజ్జత్ కా సవాల్‌గా మారింది. తనను రాజకీయంగా నిలబెట్టి హీరోను చేసిన ఆ పసుపుబోర్డే తనను నిలువునా పాతరేసేలా ఉందని అర్వింద్ గ్రహించాడు. అందుకే ఇక అబద్దాలు చెప్పి ఎక్కువ రోజులు రాజకీయాల్లో ఉండడం కుదరదనుకున్నాడు. ప్రధాని మోడీ చేత పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేయించాడు. ఇదిలా సాకారం చేయించుకున్నాడు. అనుకున్నది సాధించాడు.
ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి రాజకీయాలపై చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు జైలుకు పోయి వచ్చిన కవిత ఇప్పుడిప్పుడు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నది. ఎమ్మెల్యేలంతా కలిసి పార్టీని భ్రష్టుపట్టించేశారు. ఇక ఆమె ఒంటరిపోరు చేస్తున్నది. జనం దరి చేసే యత్నం చేస్తున్నది. కానీ అదంతా ఈజీకాదని తెలుస్తూనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లోనే మళ్లీ అర్వింద్‌కు వెయ్యేనుగుల బలాన్నిచ్చేలా పసుపుబోర్డు ఏర్పాటు జరిగిపోనుంది. ఒక్క పసుపుబోర్డు… కవితను రాజకీయంగా దెబ్బ కొడుతూ వస్తోంది…. అర్వింద్‌ను పైకి పైపైకి లేపుతూ పోతోంది.