(దండుగుల శ్రీనివాస్)
గద్దర్ బిడ్డె వెన్నెల తాజాగా విడుదల చేసిన ఓ సర్క్యులర్ వివాదంలో చిక్కుకున్నది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్‌గా ఉన్న ఆమె తాజాగా ఓ ఉత్తర్వు వెలువరించింది. అందులో ఉన్న సారాంశమేమిటంటే… ఎమ్మార్పీఎస్ కార్యక్రమాల్లో మాదిగ కళాకారులు పాల్గొనకూడదని. ఒకవేళ ఈ ఉత్తర్వులు బేఖాతరు చేసి పాల్గొంటే కఠిన చర్యలుంటాయని కూడా ఆమె అందులో హెచ్చరించింది. ఇప్పుడిది వివాదమై కూర్చుంది. దీనిపై మందక్రిష్ణ మాదిగ విరుచుకుపడుతున్నాడు. నియంత పాలనగా అభివర్ణించిన కేసీఆర్ పాలనలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన గుర్తు చేసుకున్నాడు.
అసలు వెన్నెల సాంస్కృతిక సారథి చైర్ పర్సన్‌గా అర్హురాలే కాదని ఆయన విమర్శించాడు. సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా కొంత మంది మాల కులానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టాడు మంద క్రిష్ణ మాదిగ. మాదిగ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం.. సర్కార్ జాప్యం తదితర కారణాలతో మందక్రిష్ణ ఈ మధ్య ఎమ్మార్పీఎస్ మీటింగులు పెట్టి అన్ని వర్గాలతో మద్దతు తీసుకుంటున్నాడు. దీనికి ధీటుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో మాలల బలప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెన్నెల తీసుకున్న ఈ నిర్ణయంపై భగ్గుమంటున్నది మాదిగ లోకం. ఇప్పటికే మాదిగలు కాంగ్రెస్‌కు దూరమవుతున్నారు. బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ చర్యలతో మరింత దూరంకానున్నారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో లక్ష డప్పులు, వేల గొంతుల పేరుతో మంద క్రిష్ణ మాదిగ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. దీంతో ఆ సభకు వెళ్లకుండా సారథిలో పనిచేస్తున్న మాదిగ కళాకారులను అడ్డుకోవడానికి ఇదంతా చేస్తున్నారని ఆ వర్గం తీవ్రంగా తప్పుబడుతోంది.