(దండుగుల శ్రీనివాస్)
చేసిన పాపాలు, లోపాలు లెక్కించే టైం వచ్చింది. అడిగే సమయం ఆసన్నమైంది. చేసిన తప్పిదాలను ప్రశ్నించే గళానికి ఇన్నాళ్లకు ధైర్యం వచ్చింది. నిలదీసి అడిగే సందర్భమూ ఇక ఇదేననుకున్నారు. సూచనలు చేయడమే కాదు.. లోపాలు సరిచేసుకోమనే హితబోధ కూడా చేసే పరిస్థితులు ప్రస్తుతం తలెత్తాయి. కవితక్క జైలుకు వెళ్లివచ్చిన తరువాత మళ్లీ తన రాజకీయ సెకండ్ ఇన్నింగ్స్ జాగృతినే ఎంచుకున్నది. బీసీ గళం విప్పింది. బతుకమ్మతో రాజకీయంగా బతికిన ఆమె మళ్లీ బతుకు కోసం బతుకమ్మను ఎంచుకున్నది.
అదంతా ఓకే. ఆమె అస్థిత్వం. ఆమె రాజకీయం. కానీ ప్రజలది షార్ట్ మెమరీ కాదు. గతంలో చేస్తూ వచ్చిన తప్పిదాలను ఎత్తిచూపేందుకు అప్పుడు ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు ఆ గళం బయటకు వచ్చింది. అక్కా… మీ జాగృతిలో నాయకులతో ఎలా వేగుతున్నారు. ఎలా భరించారు. ఇంకా భరించాలా..? అంటూ ఒకే ప్రశ్నలో ఎన్నో తప్పిదాలను ఎత్తిచూపి వారి గతాన్ని ప్రశ్నించడంతో పాటు భవిష్యత్తును కూడా నిర్దేశించే హితబోధ చేసే స్థాయికి వచ్చారు.
హార్డ్ కోర్ బీఆరెస్ వ్యక్తి ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అవును… నిజమే…! బీసీ గళమెత్తిన మీరు ఎంత మంది బీసీలకు జాగృతిలో కీలక పదవులిచ్చారు. మీ కులమనే ఏకైక కారణంతో నిజామాబాద్ జాగృతి బాధ్యతలు తెలంగాణ చరిత్ర పట్ల కనీస అవగాహన కూడా లేని ఓ వ్యక్తికి ఇవ్వలేదా..? ఇప్పటికీ మార్చే ఆలోచన మీలో రాకపోవడం మీ కులపిచ్చికి నిదర్శనం కాదా..? బతుకమ్మ పేరుతోనే మీ జాగృతికి జీవం కదా.. మరి ఆ బతుకమ్మ ఆడే మహిళలు ఎంత మంది కీలకంగా మీ జాగృతిలో ఉన్నారు….?
ఎన్నో ప్రశ్నలు.. సమాధానలు లేవు. మార్పలు లేవు. మారడం సాధ్యం కాదు. చెప్పడం సులభమే. కానీ ఆచరించడమే కష్టం. కానీ ఇప్పుడు ఆ రోజులు లేవు. అడిగే గొంతులు లేచాయి. అవి బయట వాళ్లవి కావు. మన ఇంట్లో నుంచే.