(దండుగుల శ్రీనివాస్)
డబుల్ బెడ్ రూం ఇండ్ల స్కీం కేసీఆర్ ప్రకటించగానే పేదలు చాలా మంది దీనిపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అదో సంచలనం. పేదోడికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తానని కేసీఆర్ ప్రకటించగానే కోట్ల కుటుంబాల్లో ఓ వెలుగు. ఓ ఆశాకిరణం. అప్పటి వరకు ఏ నేతా నోటి వెంట రాని పలుకు అది. ఏ నాయకుడూ ఇవ్వని అరుదైన హామీ అది. అప్పటికే కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలకు చాలా గురి ఉండె. అందులో డబుల్ బెడ్ రూం పథకం పట్ల వారంతా విపరీతంగా ఆకర్షతులయ్యారు. బ్రహ్మరథం పట్టారు. అధికారం కట్టబెట్టారు. కానీ జరిగిందేమిటి…? డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల స్కీం అట్టర్ ఫ్లాప్. పెరిగిన ధరలు. ప్రభుత్వం ఇచ్చే బిల్లులకు ఏమాత్రం పొంతనలేదు.
కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. జాగాలు దొరకలేదు. దొరికినా కట్టే దిక్కులేదు. కట్టినా బిల్లు ఇచ్చే దిక్కులేదు. ఇవాళ రేవంత్‌రెడ్డి మాట్లాడినట్టు.. అన్నీ కట్టుకున్నారు కానీ పేదోడి ఇళ్ల నిర్మాణాల విషయంలో మాత్రం పట్టించుకోక ఆగం చేశారని. ఇది వాస్తవం. రెండు టర్ములు కూడా ఆశపెట్టి ఓట్లేయించుకుని ప్రజలకు నిలువునా మోసం చేసింది కేసీఆర్ సర్కార్. కట్టిన ఇండ్లు అరకొర.. వాటిని చూపుతూ ఓట్లు దండుకోవడం.. ఆ తరువాత సర్వే అని … అర్హుల జాబితా రెడీ చేస్తున్నామని కతలు చెబుతూ కాలయాపన చేయడం .. ఇలాగే సాగింది పదేండ్లు. మొత్తానికిఈ స్కీం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాత మొన్న మొన్న ఎన్నికల ముందు కూడా ఐదు లక్షలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ వెనక్కి తగ్గి మూడు లక్షలే అన్నాడు.
అంటే అంత పెద్ద మొత్తంలో పెట్టడం తనవల్ల కాదని చేతులెత్తేశాడు. కానీ ఎన్నికల హామీలో మాత్రం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఐదు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చాడు. సరే అప్పుడు అధికారంలోకి రావడానికి ఏదో చెప్పాడనుకోండి..! కానీ అదంతా ఈజీ కాదు. ఐదు లక్షలతో డబుల్ బెడ్ రూం ఇళ్లు కాదు.. అంతకు మించి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రిలీజ్ చేసి లబ్దిదారులందరికీ న్యాయం చేయడం అనేది అసంభవం. అసలు బడ్జెట్టే లేదు. కేసీఆర్ లాంటి అబద్దపు హామీలిచ్చి గద్దెనెక్కిన నేత కూడా చివరాఖరులో మూడు లక్షలకు మించి ఇవ్వను పో అని మాట మార్చి యూ టర్న్ తీసుకున్నాడు. అంతటి ఆర్థిక భారం ఈ పథకంలో. ఇవాళ రేవంత్ రెడ్డి బాగా మాట్లాడాడు. గతంలో కేసీఆర్ తప్పిదాలను ఎంచి, గుర్తు చేసి దెప్పి పొడిచి మేము చేసి చూపిస్తామన్నాడు. కానీ అవి నిర్మించడం అంత వీజీ కాదు. అది ప్రాక్టికల్‌గా రోజులు గడుస్తుంటే అర్థమవుతోంది. మొత్తానికి ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల స్కీం పథకమే పేదోడిని మోసం చేసే పథకంగా మారింది.