(దండుగుల శ్రీనివాస్ )
ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసుండాలంటారు. అదే చేశాడు సీఎం రేవంత్‌రెడ్డి. సీఎం సొంత ఇలాఖ కొడంగల్ లోని లగచర్ల ఇష్యూని ఢిల్లీ దాకా తీసుకెళ్లి రచ్చరాజకీయం చేసిన కేటీఆర్ సీఎం రేవంత్ వ్యూహంలో చిక్కుకున్నాడు. రేవంత్ రెడ్డి మెడలు వంచి లగచర్లలో భూసేకరణ ను విరమించుకునేలా చేశామని బీఆరెస్ సంబురాలు చేసుకున్నది ఇవాళ. అసలు కథ వేరే ఉంది. కానీ అది పూర్తిగా తెలుసుకోకముందే షరా మామూలుగా, తనకు అలవాటైన దోరణిలో మళ్లీ అత్యత్సాహపు ప్రకటన, సంబురాలు, విజయోత్సవాలు చేసుకున్ని బోల్తా కొట్టింది బీఆరెస్ పార్టీ. కేటీఆర్.
రైతులు ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దంటున్నారని, భూములు ఇవ్వమని అంటున్నారని .. అందుకే కలెక్టర్‌ను కూడా చూడకుండా దాడి చేశారంటూ సమర్థిస్తూ వచ్చిన కేటీఆర్… లంబాడాలపై పోలీసులు దాడి చేసి, అరెస్టులు చేశారంటూ ఢిల్లీ వరకు వెళ్లాడు. అయితే దీనిపై ఇవాళ సర్కార్ కీలకమైన ప్రకటన ఒకటి చేసింది. రైతులకు గుడ్ న్యూస్ అని తన తాజా నిర్ణయాన్ని వెలువరించింది ప్రభుత్వం. అదేంటంటే…. లగచర్ల, హకీంపేట్ , పోలేపల్లి గ్రామాల పరిధిలో కంపెనీల ఏర్పాటులో భాగంగా ఇక్కడ ఫార్మా కంపెనీలుండవు… టెక్ట్స్‌టైల్ కంపెనీలే ఉంటాయని చెప్పింది. అంతేకాదు ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నట్టు ప్రకటించింది.
పనిలో పనిగా ఫార్మాకాకుండా వేరే కంపెనీలైతే స్వచ్చంధంగా ఇక్కడి ప్రజలు భూముల ఇస్తామన్న అంశాన్ని సర్కార్ ప్రస్తావించింది. టెక్ట్స్ టైల్ కంపెనీలు ఏర్పాటు చేస్తే పొల్యూషన్ ఉండదు.. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలుంటాయని కూడా చెప్పుకొచ్చింది. అంటే భూసేకరణ యథావిధిగా ఉంటుంది. పరిహారం విషయంలో కూడా ఇంకా పెంచినా ఆశ్చర్యం లేదు. జనాల తరుపున బీఆరెస్ పార్టీ ఇక్కడ ఫార్మా కంపెనీలతో ఇబ్బందులున్నాయని, సీఎం అల్లుడి ఫార్మా కంపెనీ కోసమే ఇదంతా చేస్తున్నాడని ఆరోపించిన దరిమిలా…. ఈ నిర్ణయంతో కేటీఆర్‌కు గట్టి షాక్‌నే ఇచ్చాడు రేవంత్ రెడ్డి. మొదటగా ఇక్కడ ఫార్మా కంపెనీలు రావని ఒక క్లారిటీ ఇచ్చాడు.
దీంతో అల్లుడు, ఫార్మా .. అనే ఆరోపణలకు చెక్ పెట్టాడు. ఇక జనాలు ఫార్మా కంపెనీల పొల్యూషన్ కారణంగా పరిశ్రమలు వద్దంటున్నారు.. భూములు ఇవ్వమని అంటున్నారని బీఆరెస్ గట్టిగా వాదిస్తూ వస్తోంది. ఇప్పుడు టెక్ట్స్‌టైల్ కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి అభ్యంతరాలు , ఆటంకాలు పెట్టే అవకాశమే లేదుగా.. అని బీఆరెస్ నోటికి తాళం వేసింది. ఇక తను అనుకున్నట్గుగా తన నియోజకవర్గంలోనే పరిశ్రమలు పెట్టించి అక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని పట్టుదలతో ఉన్న సీఎం తన పంతాన్ని నెగ్గించుకుంటున్నాడు.
ఈ వ్యూహం ద్వారా మూడు ప్రయోజలనాలను సాధించింది సర్కార్. ఒకటి బీఆరెస్ నోటికి తాళం వేయడం, రెండు.. భూసేకరణకు ఆటంకం లేకుండా చేసుకోవడం, మూడు… తన అనుకున్నట్టుగానే కొడంగల్‌లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకోవడం… ! ఈ వ్యూహం తెలియక మళ్లీ బొక్కబోర్లా పడ్డాడు కేటీఆర్. తమ పోరాటం ఫలితంగా భూసేకరణ నుంచి సర్కార్ తప్పుకున్నది.. విరమించుకున్నదని తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది.. అన్నట్టుగా సంబరాలు, ప్రకటనలు ….ఏదేదో చేసుకుంటున్నారు. ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. అంటే ఇదేనేమో.