(దండుగుల శ్రీనివాస్)
పుట్టిన రోజున కేటీఆర్ మంచిగా విషెస్ చెప్పాడు రేవంత్‌కు. హ్యాపీ బర్త్‌డే అని. ఆ రోజైనా వదలొచ్చు కదా. ఖాళీగా ఉండొచ్చు కదా. వచ్చినోళ్లను కలవొచ్చు కదా. అందరితో హ్యాపీగా ఉండొచ్చు కదా. ఉహూ…! ఆ మూసీ వెంట పరుగులేందీ..? ఆ నురగల మురుగు నీటిలో బోటు షికారేందీ..? ఆ గొంతు చించుకొని తిట్ల దండకమేందీ..? ఏందీ.. ఏందీ మాకీ టార్చర్. మూసీలు ముంచుతానంటావ్… అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తానంటావ్..! బిల్లా రంగా అంటావు… చార్లెస్ శోభరాజ్ అని కొత్త బిరుదులిస్తావ్..! దోచుకతిన్నారంటావ్..! కోట్ల విలువజేసే భూములు ధరణిలో దంచుకున్నారంటావ్… ఎందుకు…? ఎందుకిదంతా…!
ఎప్పుడూ అనేవే కదా. ఎప్పుడూ తిట్టేవే కదా. బర్త్ డే రోజూ వదలవా..! జన్మదినం రోజున మురుగు కాలువల పొంటి తిరుగుతూ జన్మధన్యమైందంటావ్. ముందుంది అసలు సినిమా అని జడుసుకునేలా చేస్తావ్..! ఒక్కరోజు.. ఒక్కరోజు వదలవా…! నువ్వేమైనా ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ అనుకుంటున్నావా..! మొత్తం ఒక్కసారిగా మూసీని మార్చేస్తానంటున్నావ్… అయితదా..? ఎవరైనా ఇప్పటి వరకు సీఎం తన బర్త్ డే రోజునా ఇలా మురుగు కాలువల, నురుగు నీటి వెంట పరుగులు తీశాడా..! కంపు కొడుతున్న నీటిలో పడవ ప్రయాణం చేశాడా..? ఏందీ ఏందీ మాకీ టార్చర్..! ఇలా మురుగు బాగు చేస్తా… మీ అంతు చూస్తా…! తొక్కి పడేస్తా..! మూసీలో ముంచి చంపుతా..! నువ్వు సీఎం ఇప్పుడు. ఆ తిట్ల దండకం పుస్తకం జర ఎవరికైనా ఇస్తావా…! ఇయ్యవా… ఇది నీ పేటెంటేనా… మీము వినక తప్పదా..? కర్ణభేరీ పగలి రక్తం కారడం ఆగదా..!