vastavam bureau chief- rangareddy
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారీ అక్రమ భూదందా నడుస్తోంది. అసైన్డ్, లావుణి పట్టా భూములకు సంబంధించి వందలాది ఎకరాలను చెరబట్టి పెద్ద ఎత్తున వెంచర్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ తతంగం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండడం వల్లనే చర్యలకు అధికారులు సాహసించడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఓ రియల్టర్ ఈ ప్రాంతంలోని పట్టా భూముల్లో వెంచర్‌ను ఏర్పాటు చేస్తుండగా..చుట్టూత ఉన్న రైతుల భూములను సైతం అక్రమంగా కొనుగోలు చేసి వెంచర్‌ను దర్జాగా చేపడుతున్నారు.
ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 189, అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 281 పరిధిలో రైతులకు సంబంధించిన అసైన్డ్, లావుణి పట్టా భూముల్లో గత కొద్దిరోజులుగా వెంచర్‌కు సంబంధించి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సదరు రియల్టర్ రైతులతో రహస్యంగా 99 సంవత్సరాల లీజు ప్రాతిపాదికన ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై రెవిన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లగా..తూతూమంత్రంగా నోటీసులు ఇచ్చిన అధికారులు ఆ తర్వాత అటువైపుగా కన్నెత్తి చూడడం లేదు. అసైన్డ్, లావుణి పట్టా భూములను సంబంధిత రైతులు మాత్రమే సాగు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే నిబంధనలకు విరుద్దంగా రైతులను మభ్యపెట్టి లీజుకు తీసుకోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్ల విలువజేసే భూములకు లక్షల్లో ముట్టజెప్పి రైతులను మోసం చేయడం ద్వారా సదరు రియల్టర్ పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపడితే పేదలు అనికూడా చూడకుండా హైడ్రా వారిపై ఉక్కుపాదం మోపుతుండగా..పేదలకు సంబంధించిన భూముల్లో భారీ అక్రమం జరుగుతున్నప్పటికీ..అధికారులు మిన్నకుండి పోవడం పట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ అక్రమ భూ వ్యవహారం వెనుక బడా నేతల పేర్లు విన్పిస్తుండగా..ఆ కారణంగానే అధికారులు రియల్టర్‌పై చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.