ధర్నాచౌక్‌ను ఎత్తేసిన కేటీఆర్..!
ధర్నాచౌక్ అంటే ఇద్దరికీ ఎలర్జీయే…!
అప్పుడు ధర్నాచౌక్‌ను ఎత్తేసిన కేసీఆర్…
ఇప్పుడు అక్కడ ధర్నాలో పాల్గొని ఆ పేరే ఉచ్చరించేందుకు ఇష్టపడని కేటీఆర్..
ఆ నియంత పోకడలెక్కడ పోతయ్…!
ఓడినా మారని తండ్రీ కొడుకులు..!
బీఆరెస్ సోషల్ మీడియాలో , నమస్తే తెలంగాణలో ఎక్కడా ధర్నా చౌక్ పదం రాకుండా జాగ్రత్తలు…
ఇదీ ఓడినా మారని దొరల తీరు…!
(దండుగుల శ్రీనివాస్)
ఆ అహంకారమే వారిని ఓడించింది. ఆ నియంత పాలనే కేసీఆర్‌ను ఫామ్ హౌజ్‌కు పరిమితం చేసింది. అధికారంలో ఉండగా ఎవరూ కనిపించలే. ఎవరి మాటలు చెవికెక్కలే. తాము చెప్పిందే వేదం. అనుకున్నదే సాగాలి. అట్లనే నడవాలి. అంతే. ఎవరినీ కలిసేది లేదు. ఎవరూ కలిసేందుకు వచ్చినా పర్మిషన్ ఇచ్చేది లేదు. అంతలా నడిపించుకున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడింత ఎందుకు .. చెప్పిందే చెప్పుడు అనుకుంటున్నారా..? ఇవాళ ఇందిరాపార్క్ వద్ద ఆటో కార్మికుల ధర్నా జరిగింది. దీనికి కేటీఆర్ హాజరయ్యాడు. అలా ఆయన హాజరయ్యోడో లేదో.. ఆ దంచికొట్టిన మాటలతో కలిసిన వార్తను బీఆరెస్ సోషల్ మీడియా బయటకు వదిలింది. తమ ప్రతిభనంతా చూపింది. కానీ ఇక్కడే దాని నైజం, కేటీఆర్ నైజం బయటపడింది.
ఎక్కడా ధర్నా చౌక్ అనే పదం వాడలేదు. ఇందిరా పార్క్ వద్డ జరిగిన మహాధర్నా అనే అన్నారు. అంతే ధర్నా చౌక్ అనడం ఇష్టంలేకనా..? లేక గతంలో దాన్ని ఎత్తేసింది తామే కదా.. ఇప్పుడు ఆ పదం వాడితే తిట్టిపోస్తారనే సిగ్గుతో కూడిన భయమో తెలియదు కానీ.. మొత్తానికి బీఆరెస్ సోషల్ మీడియా తమ బాస్ ఆలోచనలకు అనుగుణంగా ఈ పదాన్ని షరా మామూలుగా ఎత్తేశారన్నమాట. వీళ్లే కాదు.. నమస్తే తెలంగాణ ఇంటర్నెట్‌లో వచ్చిన వార్తలో కూడా ధర్నాచౌక్‌ను ఎత్తేశారు. అంటే అప్పుడు కేసీఆర్ ఎందరు వద్దని వారించినా ఎత్తేసే దాకా ఊకోలేదు. ఇప్పుడు కేటీఆర్ దాన్ని ఉచ్చరించడానికే ఇష్టపడలేదు. మరి ఇప్పుడు అక్కడే ధర్నాలు చేస్తున్నారు. అదే ధర్నాకు ఆయన హాజరయ్యాడు.
ఆ ధర్నాకు మేము పిలవకున్నా ఆయనే వచ్చాడనే ప్రచారమూ కొంత మంది కార్మికులు చేశారు. అది వేరే ముచ్చట. కానీ ఇలా తండ్రీకొడుకులిద్దరూ ఆ పాత వాసనలు పోనిచ్చుకోవడం లేదు. అంతే ఆనాడు అలా సాగింది వీరికి. ఇప్పుడు ఇలా మేము మారాము అని నిరూపించుకోవడం లేదు. అందుకు తగ్గ ప్రయత్నమూ జరగలేదు. కానీ మమ్మల్ని ఓడగొట్టినందుకు తగిన శాస్తి జరిగిందా అన్నట్టుగానే ఉన్నాయి కేసీఆర్, కేటీఆర్ వ్యవహార శైలి, మాటతీరు. అంటే ఆల్వేస్ కరెక్టే అంటున్నారు… మార్పు మాకేం అవసరం అని కూడా అనుకుంటున్నారు.