(Dandugula Srinivas)
పుట్టిన ఊరును మరిచిపోలేదు వారంతా. చిన్నప్పట్నుంచి కష్టపడి సర్కార్ చదువులు చదివిన వారికి ఆ తండా తల్లిలా పెంచింది. అక్కడే పెరిగారు. పెద్దవారయ్యారు. సర్కార్ ఉద్యోగాలూ సంపాదించారు. ప్రతీ దసరాకు ఆ తండాకు వచ్చి పండుగ చేసుకుంటారు. కలుసుకుని సంబురాలు చేసుకుంటారు. ఇప్పుడు వీరంతా కలిసి ఆ తండాలో 20 లక్షలు పోగేసి ఓ దుర్గామాత ఆలయాన్ని నిర్మించుకున్నారు.
దేవీ శరన్నవరాత్రుల మహోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండంలోని తౌర్యతండా ఉద్యోగుల గురించి మనం చెప్పుకుంటున్నది. అవును… దాదాపు 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ నుంచి వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. అయినా ఆ తండాను మరిచిపోలేదు. ఆ బంధాలను వీడిపోలేదు. ఆ బాల్యస్మృతులను చెరిపేసుకోలేదు. తమకు తోచిన సాయం చేస్తూ వస్తున్నారు.
అందులో భాగంగానే ఇలా దుర్గా మాత ఆలయాన్ని నిర్మించుకుని అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు, దసరా ఉత్సవాలు జరుపుకుంటూ అంతా ఒక్కదగ్గరకు చేరి పిల్లా పాపాలతో సంబురాలు చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.