వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్:
ఆకుపచ్చ కండువాను చూడగానే ఆయనే గుర్తొస్తాడు. ఆ కండువా వేసుకున్నాడంటే అతను రైతుగా గుర్తించబడతాడు. ఆ కండువాను వెలుగులోకి తీసుకొచ్చి రైతుబ్రాండ్ కల్పించింది ముత్యాల మనోహరెడ్డి. రైతు నేతగా జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న మనోహరెడ్డి అనారోగ్యంతో శనివారం కనుమూశాడు.
ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఎవరి మెడలో పచ్చ కండువా ఉన్నా వారిని ఇక్కడ రైతులుగా గుర్తించే ఓ ఐడెంటిటీ. ఉద్యమం చేసినా, ప్రెస్‌మీట్లలో పాల్గొన్నా ఇక్కడ పార్టీ కండువాలు పనిచేయవు. వారిని పట్టించుకోరు. ఆకుపచ్చ కండువా వేసుకుంటేనే గౌరవం, రైతుగా గుర్తింపు. అంతటి గుర్తింపును తెచ్చిపెట్టింది ఆయనే. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు కావాల్సిందేనని, అది ఏర్పాటయ్యే వరకు ఉద్యమిస్తానని, అప్పటి వరకు చెప్పుల్లేకుండానే తిరుగుతానని శపథం తీసుకున్నాడు మనోహర్. దాదాపు పుష్కరకాలం అలాగే ఉన్నాడు. మొన్నటి ఎంపీ ఎన్నికల వేళ ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రకటన చేయగానే అప్పుడు చెప్పులు తొడుక్కున్నాడు.
గతంలో తిరుపతి వరకు కూడా చెప్పుల్లేకుండా పాదయాత్ర చేసి జాతీయ స్థాయిలో పసుపు రైతుల కోసం ఉద్యమించి ఆర్మూర్ పేరును దేశ రాజకీయాల్లో వినిపించేలా చేశాడాయన. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి అంత్యక్రియలు ఆదివారం ఆర్మూర్‌లో జరగనున్నాయి.