(దండుగుల శ్రీనివాస్)
రచ్చ రాజకీయం రంజుగా మారింది. ఒకరేమో అమెరికా, మరొకరు ఢిల్లీ.. ఇద్దరి మనసు హైదరాబాద్ మీదే. ఇక్కడి రాజకీయం మీదే. కేటీఆర్ అమెరికాలో ఉండి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉసిగొల్పితే.. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ అరికెపూడి గాంధీని తగ్గేదేలె అని కయ్యానికి కాలుదువ్వమన్నాడు. ఇంకేముంది..? ఇద్దరూ రెచ్చిపోయారు. తొలత ఈ కయ్యానికి మూలకారణం పాడి కౌశిక్. అరికెపూడిని గెలుక్కున్నాడు. తనకు కావాల్సింది కూడా అదే. అరికెపూడి ఏం తక్కువ తినలేదు. ఇవాళ రారా సూస్కుందామంటూ తొడగొట్టి మరి పాడి ఇంటికి బయలుదేరాడు. అక్కడ దాడి జరిగింది. ఆ తరువాత డ్రామాటిక్‌గా అరికెపుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు.
ఆ తరువాత మళ్లీ రెచ్చగొట్టే సవాలొకటి విసిరాడు కౌశిక్. రేపు నీ ఇంటికి వస్తాం కాస్కో అన్నాడు. ఇది కాని పని. పోలీసులు ఆపుతారు. కానీ ఇలా ఇద్దరికి ఇద్దరూ రెచ్చిపోయేలా చేసింది వీరి వెనుకున్న కేటీఆర్, రేవంత్ అని అందరికీ తెలుసు. ఇక్కడ గమనించాల్సింది.. రేవంత్ దూకుడు పెంచాడు. ఓ వైపు హైడ్రా పేరుతో హల్‌చల్ చేస్తూ హైదరాబాద్‌ను గుప్పిట్లో పెట్టుకున్నాడు. క్రమంగా ఇక్కడి రాజకీయం ఆయన కనుసన్నల్లోనే కొనసాగనుంది. పార్టీ ఫిరాయింపుల పై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ ముగ్గురి ఎమ్మెల్యేలనే కాదు.. ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేలు.. త్వరలో రాబోయే మరికొంత మంది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అభయం ఇవ్వాలనుకున్నాడు. అన్నింటికీ తన బాధ్యత అని వారిలో భరోసా నింపడం ద్వారా వారిని బీఆరెస్ వీడేలా చేయడం రేవంత్ వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే అరికెపూడిని ప్రోత్సహించాడు.
ఇకపై మరింత దూకుడుగా రేవంత్ రాజకీయాలుండబోతున్నాయి. బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేలను గుంజడమే లక్ష్యంగా వ్యూహరచన సాగుతోంది.