(దండుగుల శ్రీనివాస్)
రాష్ట్రంలో అప్పుడే ఉప ఎన్నికలు రానున్నాయా..? కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే బై ఎలక్షన్ పోరుకు ఇక్కడ రంగం సిద్దం కాబోతుందా..? పార్టీ ఫిరాయింపుల పై హైకోర్టు ఇవాళ వెలువరించిన తీర్పుతో అవుననే సమాధానమే వస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేసేలా కనిపిస్తుంది. దీంతో ఉప ఎన్నికలు ఉంటాయా..? ఉండవా ..? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావ్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు మెట్లెక్కింది బీఆరెస్ పార్టీ. దీనిపై ఇవాళ తీర్పునిచ్చింది హైకోర్టు.
అసెంబ్లీ స్పీకర్ ముందు అనర్హత పత్రాలు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు. నాలుగు వారాల్లోనిర్ణయం తీసుకోవాలని, లేదంటే సుమోటాగా తీసుకుని మళ్లీవిచారిస్తామని ఆ తీర్పులో పేర్కొన్నది. దీనిపై రేవంత్ సర్కార్ తల్లడమల్లడమవుతున్నది. ఒకవేళ అనర్హత వేటు వేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో గెలుస్తామా అనే భయం పట్టుకున్నది. ఇంత తక్కువ సమయంలో రేవంత్‌సర్కార్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. బీఆరెస్ దీన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్నది. ఒకవేళ బీఆరెస్ ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే రేవంత్ సర్కార్ స్థిరత్వానికి కూడా ప్రమాదం లేకపోలేదు. దీంతో ఆచితూచి అడుగేసేందుకు నిర్ణయం తీసుకున్నది.
నాలుగు వారాల తరువాత కూడా స్పీకర్ అనర్హత వేటు వేయకపోతే సుమోటా మళ్లీ విచారణే జరుగుతుంది తప్ప వేటు పడే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతో దీన్ని మరింత కాలాయాపన చేస్తూ సాగదీత దోరణిని అవలంభించాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.