(దండుగుల శ్రీనివాస్)
హైడ్రా ఉద్దేశం నీరుగారిపోయింది. హడావుడిగా హల్ చేసి ఆగం పట్టించింది రేవంత్ సర్కార్. చెరువులు, కాలువలు కబ్జా చేసిన వారిని వదలబోమన్నది. ఎంతటివారినైనా విడిచిపెట్టమని శపథం చేశాడు సీఎం. నాగార్జునను దీనికి బలిపశువును చేశారు.
ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేశారు. అందరిలో గుబులు. రియల్ ఎస్టేట్ రంగంలో షేక్. అంతా సీఎం జపం చేశారు. రేవంత్ మాత్రం పులిమీద స్వారీ చేశాడు. అప్పుడే చెప్పాం.. పులమీద నుంచి దిగితే దానికే బలికావాల్సి వస్తుందని. ఇప్పుడు అదే పనిచేసింది సర్కార్.
చెరువుల ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నివాసాల జోలికి వెళ్లరంట. బఫర్‌జోన్‌లో నిర్మించుకున్న ఇళ్లను ముట్టుకోరంట. కేవలం ఈ ప్లేసులలో నిర్మాణదశలో ఉన్నవాటిని మాత్రమే కూల్చుతారట. పనిలో పని ఆ ఫాట్లు ఎవరూ కొనొద్దని ఓ ఉచిత సలహా ఇచ్చేసి తమ కొత్త నిర్ణయాన్ని ప్రకటించేసి అంతా ఊహించిందే నిజం చేసింది సర్కార్. ఇప్పుడిదే చర్చ అంతటా.
ఇంతోటి దానికి దీన్ని జిల్లాల్లో కూడా విస్తరిస్తం. అక్కడా కావాలంటున్నారు. జిల్లా కలెక్టర్లే వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అక్రమ నిర్మాణాలు కూల్చాలి.. అంటూ ఆదేశాలిచ్చింది సర్కార్. ఇప్పుడిక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను చెరబట్టిన కబ్జాకోరులంతా సేఫ్ అన్నమాట. ఫామ్ హౌజులు నిర్మించుకున్న దొరలు, లీడర్ల జోలికి హైడ్రా వెళ్లదన్నమాట.
హైడ్రా ఇలా మున్నాళ్ల ముచ్చటే అవుతుందని అనుకోలేదెవరు. కనీసం కొన్ని రోజుల పాటు హడల్ చేసి చంపుతారని, పాలనను సైడ్ ట్రాక్ పట్టిస్తారని అనుకున్నారు. కానీ పట్టుమని నెలగడవలే అప్పుడు బారాఖూన్ మాఫీ చేసేశాడు రేవంత్.