(దండుగుల శ్రీనివాస్)
ఓడెక్కేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న..! ఇది సీఎం రేవంత్‌రెడ్డి గురించి చెప్పేది. అవును..! కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా చెయ్యిస్తే.. ఆదుకున్నది… అధికారం వచ్చేలా చేసిందీ మీడియానే. ఇప్పుడది మరిచాడు సీఎం హోదాలో ఉన్న రేవంత్. పదేళ్ల పాటు మీడియాను చెరబట్టాడు కేసీఆర్. యాంటీ వార్తలు బంద్. అంత డబ్బా వార్తలే. దేశంలో నెంబర్‌వన్ మనమే లాంటి న్యూసే. అంతగా కీర్తించి కీర్తించి పాదదాసులయ్యారు మెయిన్ మీడియా మేనేజ్‌మెంట్. అలాంటి సమయంలో రేవంత్ వెంట ఉన్నది, కాంగ్రెస్‌కు సపోర్టు చేసింది ఈ యూట్యూబ్ గొట్టంగాళ్లే.
వెబ్‌సైట్ వెర్రిబాగులోళ్లే. డిజిటల్ మీడియా దండుగగాళ్లే. అప్పుడిలా కనిపించలేదాయనకు. ఇప్పుడు సీఎం కాగానే మాటమార్చాడు. ఏ చిన్నపాటి విమర్శనూ తట్టుకోవడం లేదు సేమ్ టు సేమ్ కేసీఆర్‌లాగా. అవును..! మొన్నటికి మొన్న ఖమ్మం వరదలొస్తే వెళ్లాడు. అక్కడా మీడియా ప్రస్తావన తెచ్చాడు. వక్రీకరించి రాస్తుందంటూనే.. జనాలు మిమ్మల్ని చూసుకుంటారని పరోక్షంగా బెదిరించాడు. తాజాగా రవీంద్రభారతిలో జరిగిన ప్రోగ్రాంలో ఎవరెవరో గొట్టాలు పట్టుకుని యూట్యూబులు పెట్టుకుని ఏదేదో రాస్తుంటారని వ్యంగ్యంగా మాట్లాడాడు తన సహజ శైలిలో.
ఇప్పుడిది అవసరమా రేవంత్..! అప్పుడు తీన్మార్ మల్లన్న చేసిందేమిటీ..? యూట్యూబ్ ముసుగులో పచ్చి బూతులు మాట్లాడలేదా..? సీఎం అని కూడా చూడకుండా కేసీఆర్‌ను చెడామడా తిట్టలేదా..? అప్పుడు వీనులవిందుగా అనిపించింది రేవంత్‌కు. అందుకే అధికారంరాగానే చంకనెక్కించుకున్నాడు. మల్లన్నను ఎమ్మెల్సీ కూడా చేశాడు. ఇప్పుడు వీళ్లంతా గొట్టంగాళ్లలా కనిపిస్తున్నారాయనకు. ఏందో..! ఏడాది కూడా కాలేదు అధికారం వచ్చి. అప్పుడే అంత వైరాగ్యమా..? అప్పుడే మీడియాతో అంతరం పెంచుకోవడానికి ఆత్రమా..!