(వాస్తవం ప్రత్యేక ప్రతినిధి)
రాజకీయాలలో ఓ విషాదం పరిణామం. ఓ చీకటి అధ్యాయం. ఆస్తులను కోల్పోయి కుటుంబ జీవితాన్ని కోల్పోయి చివరకు ఆశయాలు, ఆశయం సాధించకుండానే చిన్న వయస్సులోనే ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా నిష్క్రమించిన జిట్టా బాలక్రిష్టారెడ్డి రాజకీయ నాయకులకు ఆదర్శం. త్యాగంలో యువతకు ఓ మార్గదర్శకం. కేవలం 54 ఏండ్ల వయస్సున్న ఆయన రాజకీయంలో ఎన్నో ఉత్థానాలకు కాకుండా పతనాలనే చవి చూసిన ఓ ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయారు.
త్యాగం చేసినా , సేవ చేసినా ఆయనకు చివరకు మిగిలింది ఏమిటీ..? అనారోగ్యం, అప్పులు తప్ప. ప్రజాసేవలో, రాజకీయ జీవితంలో దాదాపు 100 కోట్లు కోల్పోయి ఒక ప్రజాప్రతినిధిగా కూడా నిలవలేకపోయిన జిట్టా బాలక్రిష్టారెడ్డి జీవితమే ఓ విషాదాంతం. భువనగిరికి చెందిన ఆయన అతి చిన్న వయసులోనే యువజన సర్వీసుల పేరుతో వ్యవస్థను స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను ఏర్పాటు చేసుకున్నాడు.
ఎమ్మెల్యే కాకపోయిన ఆ స్థాయిలో రాజకీయాలను శాసించాడు. ఆపదలో ఆదుకునే నాయకుడిగా, పిలిస్తే పలికే నేతగా, ఉదార స్వభావం గల ఉన్నత వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. ఆపదలో ఎవరు వచ్చినా ఆపన్న హస్తం అందించే అతడికి చివరకు రాజకీయాల్లో రిక్త హస్తమే మిగిలింది. పరిస్థితుల ప్రభావం వల్ల చాలాపార్టీలు మారినప్పటికీ తెలంగాణ ఉద్యమ నేతగా ఆయనకు మంచి పేరుంది. భువనగిరి నుంచి రెండు సార్లు ఇండిపెండెంట్ గా పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
బీజేపీలో టికెట్ రాకపోతే కాంగ్రెస్‌లో చేరాడు. వైఎస్ జగన్ పార్టీలోకూడా పనిచేశాడు. తెలంగాణకు జగన్ సపోర్టు చేయకపోతే మళ్లీ టీఆరెస్‌లోకి వచ్చాడు. అందరూ వాడుకున్నోళ్లే ఉన్నారు. కానీ ఆదుకున్నది మాత్రం ఎవరూ లేరు. యువనాయకత్వం ఆయనవెన్నంటి ఉంటుంది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత ఆయన. రాజకీయాలలో మరీ ఉదారంగా, మంచిగా ఉంటే ఎంత భారీ నష్టమో బాలక్రిష్ణ జీవితం నిదర్శనం. ఇదొక వాస్తవం.