(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ అంతే. గోకితే లెవ్వనోడు.. తంతే లేస్తాడా..? ఇది కేసీఆర్ అనే ఊతపదమే. సరిగ్గా ఆయకే ఇది వర్తిస్తుంది. ఉద్యమనేతగా ఉన్నా, సీఎంగా పదవి బాధ్యతలు మోస్తున్నా… ప్రతిపక్ష నేతగా జవాబుదారీ హోదాలో ఉన్నా.. ఆయన వైఖరిలో మార్పు రాలేదు. రాదు. ఇక రాబోదు కూడా. ఎవరో ఏదో అన్నారని ఆయన ఆత్ర పడడు. పట్టించుకోడు. జనం దుమ్మెత్తిపోసినా, ప్రతిపక్షాలు ఛీ థూ అనే విధంగా మాట్లాడినా డోంట్ కేర్ అంటాడు.
కేసీఆర్ అంటే అదో టైపన్నమాట. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. చాలా రోజులుగా కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నాడు. అధికారం కోల్పోయినంక ఆయన వైరాగ్యంలోకి వెళ్లిపోయాడు.ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యాడు. ఫామ్‌హౌజ్ రాజకీయాలకు ఆయనకు ఇప్పుడేం కొత్త కాదులెండి..! ప్రస్తుతం హాట్ టాపిక్ ఖమ్మ వరదలు. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. పెను విషాదమే చోటు చేసుకుంది. ప్రకృతి వైపరీత్యానికి తోడు అధికార యంత్రాంగం, లీడర్ల నిర్లక్ష్యం లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. కానీ ఇక్కడ రేవంత్ వరద రాజకీయం చేశాడు. కేసీఆర్ ఫామ్‌హౌజ్ వదలి రాలెదెందుకన్నాడు.
లక్ష కోట్లు సంపాదించిన కేసీఆర్ ఓ రెండు వేల కోట్లు ఇవ్వొచ్చు కదా అని చురకంటించాడు. కేటీఆర్ అమెరికా వెళ్లి ఇంకా రాలేదెందుకూ..? అని ప్రశ్నించాడు. వీటికి తండ్రీ కొడుకులిద్దరూ స్పందించలేదు. కేటీఆర్ ఏమో తన వద్ద డబ్బులు లేవని కామెంట్ చేసి నవ్వుల పాలు కాగా, కేసీఆర్ అయితే చడీ లేదు. చప్పుడూ లేదు. ఇప్పటి దాకా ఇంకా ఆయన అమెరికా వీడలేదు. కేసీఆర్ ఫామ్ హౌజ్ దాటి రాలేదు. పల్లెత్తు మాట మాట్లాడలేదు. స్పందించలేదు. ఆయన ఎప్పుడు బయటకు వ స్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంత వరదలు, ప్రమాదాలు, తీవ్ర నష్టంలో కూడా చప్పుడు చేయని కేసీఆర్.. మదిలో ఓ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మద్దతుగా నిలిచి దృష్టంతా తనవైపు తిప్పుకోవాలనే ఆలోచన ఉంది. అది కార్యరూపం దాల్చుతోంది. అదేంటో తెలుసా..? రుణమాఫీ. అవును…: వరదల్లో తాను వెళ్లి జనాలను పరామర్శించేదేందీ..? అదెప్పుడైనా చేశానా..? ఓ రేవంత్ అన్న మాత్రాన తాను హడావుడి ఖమ్మం వెళ్లాలా..? సీఎంఆర్ఎఫ్‌ను ఆర్థిక సాయం చేయాలా..? నో నత్తింగ్. డోంట్‌కేర్. కేసీఆర్‌కు ఏది లాభమనిపిస్తే.. ఏదీ పార్టీకి మేలు చేస్తుందనిపిస్తే.. తాను వెళ్తే అక్కడ మైలేజీ తప్పక లభిస్తుందని భావిస్తేనే ఫామ్‌హౌజ్ నుంచి అడుగు బయట పెడతాడు.
అప్పటి వరకు ఎవరెంత మొత్తుకున్నావినడు. కదలడు. రుణమాఫీపై జనాల్లో స్పందన ఎట్లా ఉంది..? రైతులు గవర్నమెంట్‌పై బాగా కోపంతో ఉన్నారా..? ఇప్పుడు సర్వేతో స్వాంతన పడుతున్నారా.? పోరాడుదామనే ఆలోచనలో ఇంకా ఉన్నారా….? ఉంటే అప్పుడు తాను వెళ్లాలి. వారితో కదం కలపాలి. నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి. రైతు వ్యతిరేకతతోనే తన పోరాటం మొదలు కావాలి..? ఇదీ ఆయన ఆలోచన. అందుకోసం ఎదురుచూస్తన్నాడు. సమయం కూడా కాచుక్కూర్చున్నాడు.