(దండుగుల శ్రీనివాస్)
గోడకు కొట్టిన బంతి తిరిగి అంతే స్పీడ్ గా వచ్చి తాకింది కాంగ్రెస్‌కు. ఖమ్మం వరదలతో తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించగా సీఎం రేవంత్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లక్ష కోట్ల అక్రమ సంపాదన చేసిన కేసీఆర్ ఇలాంటి కష్ట సమయంలో ఓ రెండు వేల కోట్లు ఇవ్వొచ్చుకదా అని వెటకారమాడాడు. ఇదిప్పుడు సొంత పార్టీ నేతల మెడకే చుట్టుకుంటున్నది. సోషల్ మీడియాలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని సర్కిల్ చేసి కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
పొంగిలేటి బిడ్ద పెండ్లి కోసమే 300 కోట్ల దాకా పెట్టాడు. మరి సొంత జిల్లాలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరదబాధితులను ఆదుకోవచ్చు కదా… వారి కోసం ఖర్చు చేయొచ్చు కదా అని నిలదీస్తున్నారు. పొంగిలేటి దగ్గర మస్తు డబ్బు ఉందనే ప్రచారం ఉంది. ఇప్పుడు వరదలు కూడా ఖమ్మంలోనే ఎక్కువ డ్యామేజీ చేశాయి. ఇక్కడున్న ముగ్గురు మంత్రులు పొంగిలేటి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్‌రావు పై జనం విపరీతంగా తిరగబడ్డారు. తిట్టారు. సహాయక చర్యలు అందలేదని, వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని బురదెత్తిపోశారు.
ఈ సమయంలోనే సీఎం రేవంత్ ఇందులో కేసీఆర్ ప్రస్తావన తీసుకురావడం, రెండు వేల కోట్లు ఇవ్వొచ్చు క దా అని వెటకారం చేయడం వారిలో మరింత కోపానికి కారణమైంది. మంత్రుల వద్ద డబ్బులు తక్కువున్నాయా..? వీరేం తక్కువ తిన్నారా ..?? అనే కోణంలో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి వారిని. పొంగిలేటి బిడ్డ పెండ్లి ప్రస్తావన, అందుకు ఆయన పెట్టిన వందల కోట్ల ఖర్చునూ గుర్తు చేసి ఇప్పుడిలా నిలదీస్తున్నారు. వరద రాజకీయం చేసి కేసీఆర్ ను డిఫెన్స్‌లో పడేయాలని చూసిన రేవంత్‌కు సొంత పార్టీ నేతలకే ఇది తాకడంతో తమకు తాము సెల్ప్ గోల్ చేసుకున్నట్టయ్యింది.