(దండుగుల శ్రీనివాస్)
సేమ్ టు సేమ్ కేసీఆర్‌లాగే వెళ్తున్నాడు రేవంత్ కూడా. ఆయనప్పుడు ఫక్తు రాజకీయపార్టీ అన్నాడు. ఇప్పుడీయన పక్కా రాజకీయం చేస్తున్నాడు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఆ వివాదంలోకి కేసీఆర్‌ను లాగుతున్నాడు. బీఆరెస్‌ను బద్నాం చేస్తున్నాడు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమై సేద తీరుతున్నా ఆయన్ను వదలడం లేదు. నిను వీడని నీడను నేనే అంటూ దెయ్యంలా వెంటబడుతున్నాడు. కేటీఆర్‌ను బజారులోకి గుంజుతున్నాడు. సీఎం అయినా ఇంకా రేవంతలో పాత వాసనలు పోలేదు. అప్పుడు ఫైర్ బ్రాండ్‌గా ఈ దూకుడు తనకు కలిసివచ్చింది . ఇప్పుటికీ అదే కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాడు.
ఓ వైపు వరదలు వచ్చి ప్రజలంతా లబోదిబోమంటుంటే తీరిగ్గా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ పర్యటనలకు వెళ్లిన రేవంత్.. ఇక్కడా రాజకీయమే చేస్తున్నాడు. కేసీఆర్ పేరు లేకుండా బహుశా ఆయన స్పీచ్ ఉండకపోవచ్చేమో. కేటీఆర్‌ను తిట్టకుండా ఆయన ప్రసంగం ముగించేలా లేడు. ఇలా సాగుతోంది ఆయన వైఖరి. ఎప్పుడైనా వరదల్లో కేసీఆర్ ప్రజలను పరామర్శించాడా..? అని ఇప్పుడు జనాలకు గుర్తు చేస్తున్నాడు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు, పనుల్లో లక్ష కోట్లు సంపాదించిన ఆయన ఓ రెండు వేల కోట్లు జనాలకు ఇవ్వొచ్చుకదా అని వెటకారం కూడా ఆడుతున్నాడు. ఆయన ఒక్కపైసా కూడా ఇవ్వడు సుమా అని రెచ్చగొడుతున్నాడు కూడా.
కేసీఆర్ ఎంతటి క్రూరుడో, ఎంతటి అవినీతి పరుడో… ఇలా జనాలకు ఇంకా గుర్తు చేసే పనిని భుజానేసుకుని తిరుగుతున్నాడు రేవంత్. కేటీఆర్ అమెరికాకు పారిపోయాడంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నాడు. వాస్తవానికి కేటీఆర్ అమెరికా పర్యటనకు భారీ వర్షాలకు సంబంధం లేదు. అలా సమయం సందర్బాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నాడు రేవంత్. మళ్లీ తాన రాజకీయం చేయబోనంటున్నాడు. పనిలో పనిగా మీడియాను అర్సుకుంటున్నాడు. కరిచేస్తున్నాడు. మిమ్మల్ని ప్రజలే చూసుకుంటారంటు పరోక్షంగా మీకుందిరో అనే బెదిరింపు దోరణి ప్రదర్శిస్తున్నాడు. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. సేమ్ కేసీఆర్ లెక్కనే వెళ్తున్నాడు రేవంత్.
కేసీఆర్ కూడా కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు ఎన్ని చేయాలో అన్ని చేశారు. పరోక్షంగా బీజేపీకి ప్రాణం పోసి తాను బొందలో బొక్క బోర్లా పడ్డాడు. ఇప్పుడు రేవంత్ కూడా బీఆరెస్‌ను నామరూపాల్లేకుండా చేయాలనుకుంటున్నాడు. బాజాప్తా చెప్పాడు కూడా కేసీఆర్ గురుతులు లేని తెలంగాణ ను ఏర్పాటు చేస్తానని. అదే మాటకు కట్టుబడి పనిచేస్తున్నాడు. కానీ ఇక్కడ లాజిక్ మిస్ అయ్యాడు. బీఆరెస్ బలహీన పడితే .. బీజేపీ బలపడుతుంది. జనాలు ఆల్టర్నేట్ పార్టీగా బీజేపీని ఎంచుకుంటారు. అది మరింత ప్రమాదం రేవంత్‌కు. కాంగ్రెస్‌కు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో నాలుగైదు జడ్పీ చైర్మన్లను బీజేపీ కైవసం చేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కేసీఆర్ చేసిన తప్పే రేవంతూ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ బీజేపీ నెత్తిన పాలు పోస్తున్నారు.