(దండుగుల శ్రీ‌నివాస్)

కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత‌. స్వేచ్చాప‌రిధి ఎక్కువ‌. ఎంతెక్కువంటే… నోటికొచ్చింది మాట్లాడేంత‌. మ‌న‌సులో ఉన్న‌ది ఓపెన్‌గా చెప్పేటంత‌. సీఎం కావాల‌నే ఆకాంక్ష‌ను బ‌హిర్గ‌తం చేసేంత‌. మాట విన‌క‌పోతే బాహాటంగానే బ్లాక్‌మెయిల్ చేసేటంత‌. సీఎంనే ధిక్క‌రించేంత‌. నువ్వెన్నోరోజులుండ‌వురో.. అని పరోక్షంగా బెదిరించేంత‌. అవును మ‌రి కాంగ్రెస్‌తో పెట్టుకుంటే అట్ల‌నే ఉంట‌ది మ‌రి.

ఇక్క‌డ రేవంత్ సీఎం. పీసీసీ చీఫ్ కావ‌డ‌మే ఓ వండ‌ర్ కాంగ్రెస్‌లో. అప్పుడే దుమ్మెత్తిపోశాడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి. ఓటుకు నోటు కేసులో క్రిమిన‌ల్ అత‌డి చేతి కింద ప‌నిచేయాలా అని ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ తిట్టి బీజేపీలోకి పోయాడు. మ‌ళ్లీ వ‌చ్చాడు. అంతే కాంగ్రెస్‌లో బారాఖూన్ మాఫీ. మ‌ళ్లీ వ‌చ్చి కొంచెం నోటికి తాళం వేసుకున్నా అది కాంగ్రెస్ ర‌క్తం క‌దా. ఇలా అప్పుడ‌ప్పుడు ఎవ‌రి నోటికొచ్చింది వారి వాగ‌క‌పోతే వాళ్లు కాంగ్రెస్ లీడ‌ర్లెట్ల‌యిత‌రు..?

అందుకే ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిని ప‌ట్టుకుని ముఖ్య‌మంత్రి అన్న‌డు. అల‌వాటులో పొర‌పాటుగా నోటి దుర‌సులో భాగంగా బ‌చ్‌ప‌న్ ఖ్యాల్‌లో ప‌రిపాటిగా ఏదో అన్నాడ‌నుకుందాం. కానీ దాన్నే మ‌ళ్లీ రిపీట్ చేసి నీకు సీఎం ప‌ద‌వి మిస్ అయ్యింది. ఎప్ప‌టికైనా సీఎం అవుతావు అన్నాడు. అంటే అన్నాడు అక్క‌డితో ఆగ‌లేదు. నా నాలుక మీద పుట్టుమ‌చ్చ‌లున్నాయి… నేనేదంటే అది అవుతుంది అని ఓ శాపం, ఓ వ‌రం ఇచ్చేశాడు. శాప‌మెవ‌రికో, వ‌ర‌మెవ‌రికో తెలుసు క‌దా. నీకు మంత్రి ప‌ద‌వి ఏమైనా వ‌చ్చేది రావ‌డం లేదా కోమ‌టి బ్ర‌ద‌ర్‌. ఇలా బెదిరిస్తేనైనా ఇస్తారంటావా..? అయినా నీకు మంత్రి ప‌ద‌వి ఇచ్చినా ఇయ్య‌క‌పోయినా నువ్వూ సీఎంకు ఏం త‌క్కువ కాదు. మీ బ్ర‌ద‌ర్ కూడా ఓ సీయేం ఏం త‌క్కువ తిన‌లేదు. ఓ ఉత్త‌మ్ సీఎం. ఓ పొంగులేటి షాడో సీఎం. డిప్యూటీ భ‌ట్టీ ఓ ఆల్ట‌ర్‌నేట్ సీఎం. శ్రీ‌ధ‌ర్‌బాబూ మ‌రో సీఎం.. పొన్నం ఇంకో సీఎం.. ఇలా మీరంతా సీయేంలే కదా. ఎవ‌రికెవ‌రూ తీసిపోరు.

అంతే మ‌రి. ప్ర‌జ‌లకిచ్చిన హామీలు మ‌న‌కేలా..? మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్త‌మో లేదో టెన్ష‌న్ అస‌లే వ‌ద్దు. ప్ర‌జ‌ల లొల్లితో మ‌న‌కేం సంబంధం. మ‌న సీనియారిటీ ఏందీ..? మ‌న ప‌ద‌వులేందీ..? మ‌న ప‌లుకుబ‌డి ఏందీ..? అదీ ఇక్క‌డ పాయింట్‌. మొన్న మొన్న పార్టీలోకి వ‌చ్చి సీఎం అయితే.. మ‌రి మ‌న‌మేం త‌క్కువా…? ఇలా మాట్లాడ‌టంలో త‌ప్పేం లేదు బ్ర‌ద‌ర్‌. నువ్వూ ఏదో ఒక రోజు సీఎం అవుతావు. నీ నాలుక‌పై పుట్టుమ‌చ్చ ఉన్న‌ట్టే.. ప్ర‌జ‌ల చేతుల్లో ఓటు హ‌క్కు ఆయుధం ఉందిగా. వేస్తారు. చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed