(దండుగుల శ్రీనివాస్)
స్వల్ప వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి జనాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. జనాలందరి మాట ఒకెత్తయితే.. ప్రధానంగా రైతుల నుంచి సెగ తాకడం మొదలైంది. ఏదైతే తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని, బీఆరెస్‌ను డైలమాలో పడేస్తుందని తొడగొట్టి మరీ సవాల్ విసిరి రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాడో అదే ఇప్పుడు రేవంత్ మెడకు చుట్టుకోబోతుంది. రెండు లక్షల రుణమాఫీ పేరిట రేవంత్ ఇచ్చిన హామీ సగం మంది రైతులకు కూడా చేరుకోలేకపోయింది.
ఖజానా ఖాళీని బయటపడనీయకుండా, రుణమాఫీ చేశాననే బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆంక్షల వలయంలో రైతును దిగ్భంధం చేశాడు రేవంత్. రేషన్‌కార్డును ప్రామాణికం చేశాడు. పెద్ద రైతులంటూ వారి రుణమాఫీ ఎగ్గొట్టాడు. గురడి కాపులంతా ఇప్పుడు గుర్రుగా ఉన్నారు కాంగ్రెస్ సర్కార్‌పై. ఇప్పుడు సర్వే పేరుతో కొత్త డ్రామా షురూ చేశాడు.
సర్వే ఇప్పుడు కొత్తగా ఎందుకు..? గతంలో రుణమాఫీ చేయలేదా..? రైతుల ఖాతా డేటా సర్కార్ దగ్గర లేదా..? మొన్నటి వరకు రైతుబంధు టకటకా పడింది కదా. మరి ఇప్పుడెందుకీ ఈ సమస్య వచ్చింది. రెండు లక్షలకు పైనున్న వారంతా మిగిలిన సొమ్ము కట్టాలంటున్నాడు రేవంత్. అదప్పుడు చెప్పావా…? ఇప్పుడే ఇవన్నీ నాటకాలెందుకు..? ఎంతైనా ఉండని రుణం.. రెండు లక్షలు మాఫీ చేసేస్తే సరిపోతది కదా..? ఈ సర్వే పేరుతో రైతులను మోసగించేందుకు చేసే కాలయాపన కాదా..? అసలు ఇది సమస్యే కానట్టు సమీక్షలు పెట్టి మరో జూ పార్క్ నిర్మిద్దాం అంటున్నాడు. వెయ్యి ఎకరాల్లో రెండు వేల కోట్లు పెట్టి ఇప్పుడు అర్జెంటుగా జూపార్క్‌ను నిర్మించే అవసరం ఏమొచ్చింది.
అసలు ఖజానా పరిస్థితి ఏమిటీ..? రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేసే వీలుందా..? రైతు భరోసాకు ఐదెకరాల సీలింగ్, ప్రజాభిప్రాయం పేరుతో ఇంకెంత కాలం సాగదీస్తూ వస్తావు..? పింఛన్ డబుల్ అయ్యేదెప్పుడు..? ప్రధాన హామీలే పీకల మీద ఊపిరి సలపకుండా ఉంటే ఇప్పడు కొత్తగా జూ పార్క్‌కొకటి అర్జెంటుగా కావాల్సి వచ్చిందట. రేవంత్ వ్యవహార శైలి, నిర్ణయాలే బీఆరెస్‌కు ఊపిరి పోస్తున్నాయి.
కేసీఆర్ కూడా అనుకోలేదు కావొచ్చు.. ఇంత త్వరగా ప్రజల వద్దకు వెళ్లి కొట్లాడాలె అని. ఎలాగూ ప్రజలు తిరస్కరించారు. ఓ రెండు మూడు ఏండ్లు ఫామ్ హౌజ్‌లో రెస్ట్ తీసుకుని ప్రజల పై ప్రతీకారం తీర్చుకుందామనుకున్నాడు. కానీ ఫామ్‌హౌజ్ వీడి ప్రజాక్షేత్రంలోకి రాకతప్పని పరిస్తితి ఉంది. ఈ పరిస్థితికి కారణం రేవంత్ వ్యవహారం, బీఆరెస్ పార్టీ దుస్థితి.