వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
కవిత బెయిల్ నేపథ్యంలో బీఆరెస్‌ను ఒంటరి చేసే ప్రయత్నం చేశాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఇప్పటికే సాక్షాత్తు సీఎం రేవంతే బీజేపీలో బీఆరెస్ విలీనం కాబోతున్నదని, దీనికి ప్రతిఫలంగా కేటీఆర్, కేసీఆర్, హరీశ్‌లకు పదవులు, కవితకు బెయిల్ ఇచ్చేందుకు అంగీకారం జరిగిందని ఆరోపించారు. కవితకు బెయిల్ రాగానే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇది బీజేపీ, బీఆరెస్‌ల ఒప్పందం వల్లే జరిగిందని, ఇక బీజేపీలో బీఆరెస్ విలీనమే మిగిలి ఉందని ఆరోపించారు. అందుకే కవితకు బెయిల్ దొరికిందన్నారు.
మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇది వరకు స్పందించిన మాదరిగానే మరోసారి బీఆరెస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కు రాజ్యసభ సభ్యుడిని చేసేందుకు రెండు పార్టీలు ఏకమయ్యాయని, ఈ విషయంలో కేసీఆర్ చతురత అద్భుతమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక కాంగ్రెస్‌లో బీఆరెస్ విలీనం పూర్తయినట్టేనని అప్పగింతలే మిగిలి ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై కేటీఆర్ మండిపడ్డారు. ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.