(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ ఓ మొండి ఘటం. తను అనుకున్నది సాధించే వరకు మొండిగా వెళ్తాడు. ఓ రకంగా చెప్పాలంటే మూర్ఖంగా కూడా ప్రవర్తిస్తాడు. ఇది అహంకారపూర్తితంగా కూడా ఉంటుంది. ఎవరి మాటా లెక్క చేయడు. ఎవరూ చెప్పేందుకూ సాహసించరు. అలాంటి కేసీఆర్ మెడలు వంచేందుకు బీజేపీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయాన్ని వాడుకున్నది. ఇక తనకు తిరిగేలేదని విర్రవీగిన కేసీఆర్.. బీఆరెస్ పేరుతో దేశాన్ని ఏలుదామనుకున్నాడు. ఇది మోడీకి నచ్చలేదు. చెక్ పెట్టాలనుకున్నాడు. అవకాశం కోసం చూశాడు. మోడీకి అవకాశం ఇచ్చింది కవిత. దీంతో ఆమెను కటకటాల పాలు చేశాడు మోడీ. ఆడబిడ్డ అని కూడా చూడలేదు. కారణం కేసీఆర్ ఆటిట్యూడ్. కేసీఆర్ మెడలువంచాలంటే, అహంకారం దించాలంటే , అధికారం పోగొట్టాలంటే మోడీకి దొరికిన ఏకైక అస్త్రం కవిత. అందుకే కవితను వదల్లేదు. బెయిల్ రాకుండా చుక్కలు చూపించింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ కేసీఆర్ ఓడాడు.
బీఎల్ సంతోష్‌ను ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఇరిక్కిద్దామనుకున్నాడు కేసీఆర్. కవితను కాపాడుకునేక్రమంలో ఓ పెద్ద రాంగ్ స్టెప్ వేశాడు. మోడీని కెలికాడు. అప్పటి వరకు ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. పైకి దూరం పాటించినట్టు నటించినా మోడీని సమర్థిస్తూ మద్దతిస్తూ తన పాలనను కొనసాగించాడు కేసీఆర్. కానీ ఢిల్లీలిక్కర్ కేసులో బిడ్డను బలి పశువును చేద్దామని కేంద్రం డిసైడ్ అయ్యిందని తెలిసిన తరువాత కూడా కేసీఆర్ మొండిగా పోయాడు. నువ్వలా చేస్తే నినిలా చేస్తా..? అని బ్లాక్‌మెయిలింగ్ దోరణిని అవలంభించడం మోడీకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. మధ్యేమార్గంగా బతిమాలుకున్నా అయిపోయేది. కానీ బతిమాలలేదు.మొండిగా పోయాడు. అధికార పీఠంపై ఉన్న కేసీఆర్ ఇక తనకు ఇప్పట్లో తిరుగులేదు .. ఎవరూ నన్ను కొట్టలేరు అని గర్వానికి పోయాడు. అది దించాడు మోడీ. గద్దె దిగేలా చేశాడు. ఒక్క కేసీఆర్ ఓడాడు.
ఆ తరువాత అన్నీ విషాదాలే కేసీఆర్‌కు. ఇంత బతుకు బతికి బిడ్డను కూడా కాపాడుకోలేని దీనస్థితికి వచ్చాడు. ఓ వైపు అధికారం పోయింది. ప్రజలు ఇలా తీర్పు ఇస్తారని కలలో కూడా అనుకోలేదు. తన లెక్కలు తాను వేసుకున్నాడు. సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని తెలిసి కూడా అహంకారంతో, డబ్బుతో ఎమ్మెల్యేలను కొనొచ్చనుకున్నాడు. ఎంఐఎం సపోర్టుందనుకున్నాడు. బీజేపీ ఎమ్మెల్యేలను కూడా గుంజొచ్చనుకున్నాడు. కానీ ఆ లెక్కలన్నీతారుమారయ్యేలా తీర్పిచ్చింది జనం. బిత్తరపోయి చిత్తరవయి చిత్తయిపోయాడు కేసీఆర్. ఇక తేరుకోవడం అంత సులువు కాలేదు. బిడ్డను కాపాడుకోలేక, మోడీ వద్ద తన పరపతి మొత్తం సమాధి కాగా చెల్లని రూపాయే అయ్యాడు కేసీఆర్. ఓపిక పట్టాడు. బిడ్డ కోసం ఎదురుచూశాడు. బెయిల్ మంజూరు కాకపోతుందా అని నిద్రలేని రాత్రులు గడిపాడు. బీజేపీలోపార్టీని విలీనం చేయబోతున్నాడనే దాడి ఓ వైపు. అయినా కిమ్మనలేదు. కాలానికే తీర్పు వదిలేశాడు. ఓపిక పట్టాడు. పళ్లబిగువన బాధనంతటినీ భరించి తన నైజాన్ని అలాగే కొనసాగించాడు. బిడ్డ తల్లడిల్లినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు. ఇక్కడ ఓడాడు కేసీఆర్.
బీజేపీతో ములాఖత్ కాలేదు. బీఆరెస్‌ను టీఆరెస్‌గా మార్చలేదు. తన పార్టీని అలాగే ఉంచాడు. పదవులకు ఆశపడలేదు. బిడ్డెకు బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేశాడు. ఎట్టకేలకు కవితకు బెయిల్ వచ్చింది. బిడ్డె విషయంలో నాన్న ఓడాడు. కేసీఆర్ ఓడిపోయాడు. నాన్ననే నమ్ముకున్న కవితకు ఇది శరాఘాతం.
ఒక్క కేసీఆర్ దోరణి..
పార్టీని ఆగం చేసింది. అధికారాన్ని దూరం చేసింది. కుటుంబాన్ని నిద్రలేకుండా చేసింది.
ఇక్కడ కేసీఆర్ ఓడాడు. ఇలా చేయడంలో మోడీ గెలిచాడు.