వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్:
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఎమ్మెల్సీ కవిత ఇంటనే ఓడింది. పార్టీ నాయకులను, నిజమైన కార్యకర్తలను, ఉద్యమకారులను విస్మరించింది. అందుకే ఆమెకు బెయిల్ వచ్చినా జిల్లా బీఆరెస్‌లో పెద్దగా స్పందన కరువయ్యింది. మొక్కుబడిగా ఓ పది మంది గుమిగూడి పార్టీ కార్యాలయంలో స్వీట్లు తినిపించుకుని అయిందనిపించారు. ఆమెకు మంగళవారం కచ్చితంగా బెయిల్ వస్తుందనే సంకేతాలున్నాయి. జిల్లాకు చెందిన నాయకులు కూడా కొందరు ఢిల్లీకి వెళ్లారు. కానీ జిల్లాకేంద్రంలో మాత్రం మిగిలిన లీడర్లంతా ఏకమై సంబురాలు చేసుకోలేకపోయారు.
కారణం.. ఆమె జిల్లాపై పట్టును కోల్పోవడమే. బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకు అధికారాలు అప్పగించిందామె. ఎవరైనా ఆమె దగ్గరికి వస్తే పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలకు భయపడింది. దీంతో ఆమెకంటూ జిల్లా పార్టీలో ప్రత్యేక ముద్రలేదు. ఆమెను కలవాలంటే ఓ కోటరి. పీఏ, పీఆర్వోల అడ్డుగోడల నేపథ్యంలో ఆమెను కలవడానికి అపసోపాలు పడే దుస్థితి ఉండే. ఆమె జైలుకు వెళ్లినప్పటి నుంచి ఇందూరు బీఆరెస్ పార్టీ మరిచినట్టే చేసింది. చాలా రోజులకు బెయిల్ వస్తే ఆ సంతోషం కనబర్చేందుకు కూడా పెద్దగా ఉత్సాహం కనబర్చలేదంటే ఆమెకు జిల్లా పార్టీపై ఎంత మేర పట్టుందో అర్థమవుతోంది.
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జీవన్‌రెడ్డిని నియమించాడు కేటీఆర్. జీవన్‌రెడ్డి అధ్యక్షతను ఎవరూ జీర్ణించుకోలేదు. అతగాడు ఓ పిలుపిచ్చినా పట్టించుకునే దిక్కులేదు. ఇంతలా పార్టీని భ్రష్టు పట్టించిన తరువాత కవిత రావడం వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయని మాత్రం ఏ లీడర్ అనుకుంటాడు. అందుకే ఇలా మిశ్రమ స్పందన వచ్చింది.