(దండుగుల శ్రీనివాస్)
సీఎం రేవంత్ రిస్క్‌లో ఉన్నాడు. తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు. కానీ రెండు ప్రధాన సమస్యలను తన మెడుకు చుట్టుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా తనే చేసుకున్నాడు. ఇదంతా స్వయంకృతాపరాధమే. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ తీసుకున్న స్టెప్ రైతుల ఆగ్రహాన్ని చవి చూసేలా చేస్తే .. హైడ్రా పేరుతో అక్రమకట్టడాల కూల్చివేతలు తీవ్ర రాజకీయ ఒత్తిళ్లకు దారి తీసే ఘట్టంగా మిగలనుంది. అక్రమ నిర్మాణాలని మనమేం అంటున్నాం.. మరి కూల్చి వేస్తే మంచిదేగా అంటారా..? అనడం సులువే. కానీ ఆచరణలో పెట్టేటప్పుడే వస్తుంది అసలు సమస్య. దీన్నిఓవర్‌కమ్ చేశాడు రేవంత్. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసి ఎక్కడా ఆపేది లేదు. ఎవరి మాటా విలేది లేదనే సంకేతం ఇచ్చాడు. బాగానే ఉంది.
నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా… అన్నట్టు నాగార్జున కమ్యూనిటీ ఏం చిన్నది కాదు. తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయిన మర్రివృక్షం. మరి అంత ఈజీగా రేవంత్ సర్కార్‌ను వదలుతాడా…? దీంతోనే అయిపోలేదు. ఇంకా చాలానే ఉన్నాయి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన ఫామ్‌హౌజ్‌లు, భారీ నిర్మాణాలు. వాటిని వదిలితే వెయ్యి కళ్లతో వాచ్ చేసే శక్తులు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. రేవంత్‌ను ప్రశ్నించేందుకు సిద్దంగా ఉన్నాయి. నాగార్జున్ ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసినప్పుడు చాలా మంది అప్రిసియేట్ చేశారు. భేష్ అన్నారు. పార్టీలకతీతంగా సంతోషించారు. దీనిపైనా రూమర్స్ మొదలయ్యాయి. ఢిల్లీకి కప్పం కట్టడంలో భాగంగా నాగ్‌ను యాభై కోట్లు రేవంత్ అడిగాడని, అవి ఇవ్వలేదని కూల్చాడని.. ఇలాంటివి. ప్రధానంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వారిలో బీఆరెస్ మెయిన్ లీడర్లే ఉన్నారు. ఇవి వాస్తవదూరమే అయినా… మున్ముందు అక్రమనిర్మాణాల కూల్చివేతల్లో ఇదే వేగం కనబర్చకపోతే దీన్ని మరింత బలంగా ప్రజల ముందుకు తీసుకుపోయేందుకు ఈ సెక్షన్ కాపుకాసుకుని వెయిట్ చేస్తున్నది.
49,600 అక్రమ కట్టడాలు.. ఇవన్నీ కూల్చడం సాధ్యమా..?
ఇప్పుడు లెక్కలు బయలు దేరాయి. నాలాల మీద నిర్మించినవి, చెరువుల్లో నిర్మాణమయినవి. అక్రమంగా ఎక్కడ ఉన్నవి అన్నీ లెక్కలు తేలుతున్నాయి. తెరమీదకు 49, 600 అక్రమ కట్టడాల అంశం వస్తున్నది. ఇవన్నీ చేతగాకనే గత ప్రభుత్వం వదిలేసింది. మరి రేవంత్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులవీ ఉన్నాయి. మరి అవన్నీ కూల్చాల్సిందే. ఒక్క కేటీఆర్ మీద ప్రతీకారంగా దీన్ని చూస్తే విమర్శల పాలవుతాడు. సినీ ఇండస్ట్రీని ఆంధ్రకు తీసుకుపోయేందుకు చంద్రబాబు ప్లానింగ్‌లో భాగంగానే రేవంత్ ఇది చేశాడనే ప్రచారాన్నీ కొంత మంది పనిగట్టుకుని చేస్తున్నారు. ఇవన్నింటికీ సరైనా ఆన్సరిచ్చి తిప్పికొట్టాలంటే ఏకైక మార్గం హైడ్రా స్పీడ్‌ను ఇదే విధంగా కొనసాగించడమే. హైడ్రాపై ఒత్తిడి తేకుండా స్వేచ్చగా దాని పని అది చేసుకునేలా చేయడమే. లేదంటే ఓ బీఆరెస్ లీడర్ అన్నట్టు ఇది హైడ్రామా ఫర్ కలెక్షన్‌లా మిగిలిపోయి సీఎం రేవంత్‌కు, సర్కార్‌కు అతి తక్కువ సమయంలో విపరీతమైన చెడ్డపేరు తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రైతులతో పెట్టుకున్నాడు..? వ్యతిరేకత పోగొట్టుకోవడం ఎలా..?
రుణమాఫీ తేనెతుట్టెను కదిపాడు రేవంత్. హరీశ్ వేసిన ఉచ్చులో చిక్కుకుని తనకు తాను సెల్ప్ గోల్ అయ్యాడు. పంద్రాగస్టు అంటూ డెడ్‌లైన్ విధించుకుని తన పీకల మీదకు తెచ్చుకున్నాడు. అసలే బడ్జెట్ లేదు. రెండు లక్షల రుణమాఫీ అంత ఈజీ కాదనీ తెలుసు. కేసీయారే లక్ష రుణమాఫీ చేయలేక చేతులెత్తేసి చతికిలబడి రైతు వ్యతిరేకత ఎదుర్కొని ఓటమిపాలయ్యాడు. ఆ అనుభవాలు ఇప్పటి సర్కార్ కళ్లముందే ఉన్నాయి. కానీ రేవంత్ సర్కార్ అవగాహన లేకుండా, మొండిగా వెళ్లి ఈ విషయంలో బొక్కబోర్లా పడింది. రైతులందరిలో యాభై శాతం కూడా రీచ్ కాలేకపోయింది. పేదలకు చేస్తే సరిపోతుందనే వారి ఆలోచన బెడిసికొట్టింది. రైతులంటేనే పేదలు, అందరికీ కావాల్సిందే… హామీలప్పుడు ఇవన్నీ కథలు చెప్పావా..? అంటూ నిలదీతల పర్వం మొదలైంది.
ఆర్మూర్‌లో పోలీసు ఆంక్షలు ఎన్నిపెట్టినా.. బెదిరించినా.. అనుమతులు లేవని కాలడ్డం పెట్టినా రైతులు ఉప్పెనలా ముంచుకొచ్చారు. కదం కదం కలిపి రోడ్డెక్కారు. అసెంబ్లీని ముట్టడిస్తామనే తీవ్ర నిర్ణయం తీసుకునేదాకా వెళ్లింది ఈ పరిస్తితి. ఇంత తక్కువ సమయంలో రేవంత్ రైతు వ్యతిరేకత ఎదుర్కొంటాడని ఎవరూ అనుకోలేదు.
పులిమీద స్వారీ.. దిగితే బలే..!
రేవంత్ ఇప్పుడు పులిమీద స్వారీ చేస్తున్నాడు. కిందకు దిగాడా ఆ పులే నోటకరుచుకుని పోతుంది. ఇప్పుడు పరిస్తితి అలాగే ఉంది. ఓ వైపు రైతురుణమాఫీ, మరోవైపు హైడ్రా కూల్చివేతలు. ఈ రెండూ సంపూర్ణం దిశగా సాగితేనే రేవంత్ తీసుకున్న రిస్క్‌కు అర్థం ఉంది. వ్యతిరేకత నుంచి ప్రశంసల వైపు పయనం ఉంటుంది. లేదంటే ఏడాది తిరగకముందే సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకతను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇది రేవంత్ రాజకీయ భవిష్యత్తుకు కూడా గొడ్డలిపెట్టే అవుతుంది.