(దండుగుల శ్రీనివాస్)
గురుతులు చెరిపేయడం అంటే ఇదే కాబోలు.. కేసీఆర్ గుర్తులే లేకుండా చేస్తానన్నాడు రేవంత్. ఆ పాలనలో సాగిన తీరుకు భిన్నంగా పూర్తి విరుద్ధంగా పోవడమే తన విధానంగా పెట్టుకున్నాడు ఈ సీఎం. అది పాలనలోనే కాదు సంస్కరణలో కూడా కనిపిస్తుంది. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..? అని చీమ కథలాగా హైదరాబాద్‌లో పెద్ద పెద్ద స్టార్లు, పారిశ్రామికవేత్తుల, నేతల అక్రమకట్టడాలు ఎన్నో ఉన్నాయి.
అవన్నీ అప్పటి పాలకులు కేసీఆర్, కేటీఆర్‌లకు తెలుసు. కానీ ఏం చేయలేదు. వారి బలహీనతలను ఆసరా చేసుకుని అలా పాలన కొనసాగించారు. కానీ ఆ అక్రమసామ్రాజ్యల జోలికి పోలేదు. తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు ఈ పదేళ్లు బీఆరెస్ నేతలూ అక్రమకబ్జాల బాగోతం కొనసాగించారు. బీఆరెస్‌లో ఉన్నదెవరు..? మళ్లీ పాత నీరే. ఆ పార్టీ ఈ పార్టీల నుంచి వచ్చిన అదే పాతసారానే. అంతా కలిసి విలువైన హైదరాబాద్ భూములను ప్రసాదంలా పంచుకుని తిన్నారు.
అప్పుడు తేలు కుట్టిన దొంగలా ఉండిపోయాడు కేటీఆర్. హైడ్రా ఒకటి ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాల బాగోతంపై రేవంత్ ఫోకస్ పెట్టగానే కలుగులోంచి ఎలుక బయటకు వచ్చింది. కేటీఆర్‌కు చెందిన జన్వాడా ఫామ్‌హౌజ్ జోలికి రాగానే ..అది తనది కాదని బుకాయిస్తూనే.. మీ నేతలేం తక్కువా..? ఇగో చూడు ఎంత మందివి ఉన్నావో అని లిస్టు బయటపెట్టాడు చిన్న పిల్లాడిలా.
మరి మా పాలనలో కదా వీరంతా అక్రమంగా నిర్మించుకున్నారు..? అప్పుడు మేం ఏం చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నాం కదా..? అని సోయి కూడా మరిచాడు. ఇప్పుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం కూల్చివేయడంతో కేటీఆర్ నోటికి తాళం పడ్డట్టయ్యింది. ఇక ఫామ్‌హౌజ్ దాకా రాకమానరు అనే సంకేతం అతగాడికి అందింది. ఇక రాజకీయం రంజుగా ఉండనుంది.