(దండుగుల శ్రీనివాస్)
ఇప్పుడు నేతల ఫామ్‌హౌజ్‌ల లొల్లి నడుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ బంగారుబాతు గుడ్లే. ఈ నేత ఆ నేత అని కాదు.. అధికారంలో ఎవరుంటూ వారు బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ భూముల అన్ని చుట్టేశారు. నేతల కబ్జాల కౌగిలలో కలిసిపోయాయి. కరిగిపోయాయి. చెరువులను మింగేశారు. గుట్టలను పొతం పట్టారు. అయితే రియల్ ఎస్టేట్ ప్లాట్ల దందా, లేకపోతే ఫామ్‌హౌజ్‌ల నిర్మాణాలు.. రాచకార్యాలు. అన్ని పార్టీల నేతల తీరు ఇదే.
ఇప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటున్నారు. అది నాది కాదు.. నా దోస్తుదంటున్నారు. నాది సక్రమమే నీదే అక్రమమంటున్నారు. ఫస్టు నీ ఫామ్‌హౌజ్ కూల్చాలని ఒకరు, మొదలు నీదే కూల్చాలని ఇంకొకరు ఇలా మాటలతో టైం పాస్ చేస్తున్నారు. కౌంటర్లిచ్చుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. కేటీఆర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కేవీపీ, గడ్డం వివేక్, మధుయాష్కీ, పట్నం మహేందర్‌రెడ్డిల ఫామ్‌హౌజ్‌లన్నీ అక్రమంగా నిర్మించినవే. ఇవి వారే బయటపెట్టుకుంటున్నారు.
శాటిలైట్ ద్వారా సర్వే చేసి చెరువుల భూముల్లో ఉన్న ఫామ్‌హౌజ్‌లన్నీ కూల్చాలని కూడా నీతి సూత్రాలు మాట్లాడిండు కేటీఆర్. మరి ఇన్నాళ్లూ వీళ్లే అధికారంలో ఉన్నారు కదా. చెరువుల భూముల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చొచ్చు కదా. ఎందుకు కూల్చలేదు. అప్పటి రాజకీయ అవసరాలు అలాంటివి.
ఇప్పుడు రాజకీయాలు మారాయి. నేతలు పార్టీలు మారారు. కానీ ఇంత మంది ఫామ్‌హౌజ్‌లు కూల్చడం హైడ్రాతో సాధ్యమవుతుందా..? కేవలం ఇవన్నీ హైడ్రామాలేనా..? ఈ తంతూ కొన్నాళ్లకు వేడి చల్లారి చుప్పున ఆరిపోతుందా..? అదే జరగనుంది. పెద్ద తేడా ఏమీ ఉండదు. బ్రహ్మాండం బద్దలు కాదు.. ఫామ్‌హౌజ్ లు కూలిపోవు. అంతా మనని పక్కదారి పట్టించే పన్నాగమన్నమాట. వాళ్లు వాళ్లు ఒక్కటే. ఆ ఫామ్ హౌజ్‌లన్నీ సేఫే.