(దండుగుల శ్రీనివాస్)
రైతులు రోడ్డెక్కారు.. ! కాంగ్రెస్‌పై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. రెండు లక్షల రుణమాఫీ ఏదీ అంటూ నిలదీస్తున్నారు. పంద్రాగస్టు నాటికి సంపూర్ణంగా రైతురుణ మాఫీ చేశానని బాహాటంగా గర్వంగా ప్రకటించి ఆపై ఇక నాకేం సంబంధం లేదనే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడు. బీఆరెస్ నాయకులంతా రోడ్డెక్కారు. రైతులు తోడొచ్చారు. కడుపు రగులుతున్న వేళ అంతా ముక్తకంఠంతో రుణమాఫీ చేస్తావా..? లేదా అని నిలదీస్తున్న వేళ.. రేవంత్ మాత్రం ఎంచక్కా ఢిల్లీ బాట పట్టాడు.
ఇక్కడంతా ఆగమాగమున్నా.. అయినను పోయిరావలె హస్తినకు అని బయలుదేరాడు. రుణమాఫీ కన్నా ఇక్కడ మంత్రివర్గ విస్తరణ ఎంతో ఇంపార్టెంట్ కదా మరి. పీసీసీ చీఫ్ నియామకం ముందు రైతుల ఆక్రోషం ఏపాటిది..? అంతేగా. రైతులంతా రోడ్డెక్కి ఏరికోరి తెచ్చుకుంటే మాకిందే బాధ అని లబోదిబోమంటున్నా అంతకన్నా అంత్యంత ప్రాముఖ్యమైన నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇప్పించుకోవాలో చర్చించుకునే మహాగొప్పకార్యం వెలబెట్టాలి కదా. అందుకే ఢిల్లీకి. అర్థం చేసుకోరూ…! మాట్లాడితే ఇప్పటికే ఇరవై సార్లు ఢిల్లీకి వెళ్లామని లెక్కలేస్తారు. వెళ్లిన ప్రతీసారి రాచకార్యమేగా వెలగబెట్టేది. రాష్ట్ర ప్రయోజనాలకే కదా వెళ్లేది. పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న రాజకీయ నిరుద్యోగుల తృష్ణ తీర్చిందుకే కదా హస్తినకు అలుపెరగకుండా తిరిగేది.
- రైతుల గోసనా..? చెప్పినం కదా. టెక్నికల్ ప్రాబ్లెమ్స్ అంతే. నెల గడువిచ్చాం. దరఖాస్తుల తీసుకుంటున్నాం. అన్నీ పరిశీలిస్తున్నాం. అంతా సరిచేస్తాం. అందరికీ ఇస్తాం. ఏం బాధలేదు. మీరు బాధపడకండి. ఓకేనా..?