(దండుగుల శ్రీనివాస్)
పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పెరుగుతున్నది. అనూహ్యంగా రోజుకో టర్న్ తీసుకుంటున్నదీ వ్యవహారం. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ నియామకం కూడా పెండింగ్‌లో పడుతూ వస్తోంది. కాగా గురువారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణకు ఆమోద ముద్రతో పాటు పీసీసీ చీఫ్ ఎవరో కూడా క్లారిటీ తీసుకొని రానున్నారు.
కాగా అనూహ్యంగా పీసీసీ చీఫ్ రేసులో కొత్త పేరు వచ్చి పడింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. అయితే ఎస్సీ, లేదా ఎస్టీలకే దీన్ని కేటాయించాలని సీఎం గట్టిగా పట్టుబడుతున్నారు. ఇందులో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అనుంగు అనుచరుడైన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. మాదిగ కులానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కీలకమైన పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టాలని సీఎం రేవంత్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అడ్లూర్ లక్ష్మణ్‌రెడ్డి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై గెలుపొందాడు. జగిత్యాల డీసీసీ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. సీనియర్ నేత అయిన జీవన్‌రెడ్డి తన అనుచరుడికి పీసీసీ పీఠం దక్కడం ద్వారా పరోక్షంగా తన ఆధిపత్యం కూడా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడు.
మాదిగ సామాజికవర్గానికి పెద్ద పీటవేసినట్టు కూడా అవుతుందనే కోణంలో సీఎం దీన్ని గట్టిగా అధిష్టానం ముందుంచి ప్రయత్నం చేస్తున్నాడు. మాలలకు పార్టీలో సముచిత ప్రాధాన్యం లభించిన నేపథ్యంలో మాదిగ అయిన అడ్లూరి లక్ష్మణ్‌కు పీసీసీ ఇస్తే సమీకరణ సరిపోతుందని భావిస్తున్నాడు సీఎం. ఒకవేళ ఎస్సీ కేటగిరీ ప్రయత్నం మిస్ అయితే.. ఎస్టీ కోటాలో బలరాం నాయక్ పేరు వినిపిస్తోంది.
కాగా మరోవైపు ఇద్దరు గౌడ్లు కూడా ఇంకా దీని కోసం పోరాడుతూనే ఉన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ సీరియస్‌గా ఈ పదవి కోసం ట్రై చేస్తుండగా, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ కూడా తన పరపతినంతా ఉపయోగించి ఢిల్లీ పెద్దల వద్ద చక్రం తిప్పుతున్నాడు. బీసీకే ఈ పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తే కచ్చితంగా మహేశ్‌కే అవకాశాలున్నాయి. ఒకవేళ మధుకు అవకాశం వస్తే అది ముమ్మూటికీ రేవంత్‌కు వ్యతిరేకంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంగా భావించాల్సి వస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.