(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ ఈ పెద్దాయనను ముద్దుగా లక్ష్మీపుత్రుడు అని పిలుచుకునేవాడు. వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పట్నుంచి తాను ప్రవేశపెట్టిన వ్యవసాయసంక్షేమ పథకాలు సమృద్ధిగా అమలు జరిగాయని కేసీఆర్ భావన. రైతులంతా సుభిక్షంగా ఉన్నారని అనుకుంటుండే వాడు. సాగు మరింత వృద్ధిలోకి వచ్చిందని సంబరపడేవాడు. దీనికి పోచారం మంత్రిగా చేయడమూ కలిసివచ్చిందని ఇలా ముద్దుగా పిలుచుకునేవాడన్నమాట.
ఇదంతా ఎందుకు చెబుతున్నాననుకుంటున్నారా..? ఈ లక్ష్మీపుత్రుడు కాంగ్రెస్ పంచన చేరాడు. రైతుల కోసం ఇంతటి పెద్ద రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్న రేవంత్ నాయకత్వాన్ని బలపర్చాలని డిసైడ్ అయ్యాయని కూడా చెప్పుకొచ్చాడు. పోచారం సీనియారిటీ తగ్గట్టే ఇక్కడా రేవంత్ కొంత ఆలస్యంగానైనా వ్యవసాయ శాఖ సలహాదారుగా ఇచ్చారు. కేబినెట్ హోదా కల్పించి మరీ. ఇచ్చిన వేళ విశేషమే అస్సలు బాగోలేదు. ఎందుకంటారా..? రుణమాఫీ పంద్రాగస్టులోగా చేస్తానని ఊదరగొట్టి.. గొట్టీ.. గొట్టీ.. చివరకు కొండంత రాంగం తీసిన చందంగా చేశాడు రేవంత్. రెండు లక్షల రుణమాఫీ ఏమోగానీ లక్షలాది మంది రైతులు రోడ్ల మీదకొచ్చి లొల్లి లొల్లి చేస్తున్నారు.
అప్పుడే రేవంత్‌కు, సర్కార్‌కు రైతు సెగ తగలింది. దీన్ని చక్కదిద్దేందుకు కొనసాగింపుగా మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. నెల గడువిచ్చారు. రైతులు మాత్రం భగ్గుమంటున్నారు. ఇది కావాలని చేసిందే తప్ప సాంకేతిక లోపాలేమీ లేవంటున్నారు. సాకులు వెతుక్కుంటూ రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నమేనని క్లారిటీకొచ్చారు. ఈ క్లిష్ట సమయంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సలహాదారు అప్పగించారు.
మరి తన సీనియారిటీని మొత్తం ఉపయోగించి ఏం సలహాలిస్తారో..? ఇస్తే వినేవారున్నారో..? వింటే అమలు పర్చుతారో లేదో..?? ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలే. మరి రైతుల కోసం ఇంత చేస్తున్నాననే కదా పార్టీ మారింది. అలాంటిది రైతుల బాధలు తీర్చే పనిని పోచారం భుజానికెత్తుకుంటాడా..? సీఎంతో మాట్లాడి అందరి రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగేలా చేస్తాడా..?? కేసీఆర్ కన్నా రేవంత్ బెటర్ అని నిరూపిస్తాడా..? ఆలస్యమవుతూ వస్తున్న రైతుబంధును వెంటనే రిలీజ్ చేపిస్తాడా..? ఐదెకరాల సీలింగ్ అంటూ తప్పించుకునే, తక్కువ చేసుకునే పనిలో ఉన్న రేవంత్‌కు ఏం చెప్తాడు..? ఇప్పటికే సీజన్ ముగిసిపోతున్నా పాత రైతుబంధు పైసలు వెంటనే విడుదల చేయించి రైతులకేమైనా మేలు చేస్తాడా.??????? అన్నీ ప్రశ్నలే. మన భ్రమలు కానీ, మన పిచ్చిగానీ నాయకుల మాటలన్నీ పదవులు, అధికారం కోసం గానీ రైతులు, న్యాయం, సంక్షేమము, సలహాలు, సీనియారిటీ… ఇవన్నీ మన చెవిలో పువ్వులు పెట్టేందుకే గదా. కాదా..?