(దండుగుల శ్రీనివాస్)
ఎంపీ ఎన్నికల వేళ ఎన్ని ఎక్కువ సీట్లు గెలిస్తే తనకు అంత పతారా ఉంటదనుకున్నాడు. ఢిల్లీ పెద్దల దగ్గర తన పరపతి మరింత పెంచుకోవచ్చనుకున్నాడు. సీఎం సీటు పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి ఇవ్వాలనుకున్నాడు. దీని కోసం దేవుళ్ల మీద ఒట్లేశాడు. ఎంపీ సీట్లు గెలిపియ్యండి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానన్నాడు. ఇది చాలదంటూ రుణమాఫీ తేనెతుట్టెను కదిపాడు. పంద్రాగస్టు డెడ్‌లైన్‌ను తానే విధించుకున్నాడు. ఆ తారీఖులోపు రెండు లక్షల రూపాయల బాకీలన్నీ తీర్చేశానని మాటిచ్చాడు. ఇన్ని చెప్పినా అనుకున్నన్ని సీట్లు రాలే. సగం బీజేపీ కొట్టేసుకుపోయింది. ఇన్ని మాటలు చెప్పినా జనాలు వినలేదని కోపమా..? ఖజానా ఖాళీగా ఉంది మొత్తం రైతులకు రుణమాఫీ సాధ్యం కాదనే గ్రహింపా తెలవదు కానీ, ఆంక్షల వలయంలో రుణమాఫీ ఇరుక్కుంది. రేవంత్ మెడకు ఇప్పుడా పంద్రాగస్టు గడువే *డెడ్*లైన్‌గా మారింది.
రేషన్‌కార్డు లేకుంటే కట్, రెండు లక్షలకు పైసా ఎక్కువుంటే కట్, ఆధార్ కార్డు సరిగ్గా లేదు అందుకే కట్.. ఇలా ఏవేవో సాకులు వెతుక్కున్నారు. కానీ సంపూర్ణంగా రుణమాఫీ చేశామని చెప్పుకొస్తున్నారు. 31వేల కోట్లన్నారు. 18వేల కోట్లే చేశారు. మరెందకు అప్పుడాలెక్కలు చెప్పారు. అప్పుడు నిజంగానే ఇద్దామనుకున్నారేమో.. ఎంపీ సీట్లు ఆశించినన్ని రాకపోవడం, రాహుల్ గాంధీ పీఎం కాకపోవడంతో మంటపుట్టినట్టుంది. అందుకే ఇలా రేషన్‌కార్డున్నోళ్లకే రుణమాఫీ చేసేసి .. సంపూర్ణమనేశారు. రైతులు రోడ్డెక్కేసరికి …అబ్బే ఇంకా ఇది పూర్తికాలే.. ప్రక్రియ కొనసాగుతున్నది. మీరు ఇవి సరిచేసుకోండని సాకుల చిట్టాను వదిలారు.
రోడ్డెక్కిన రైతన్నలపై కేసులు కూడా పెట్టారు మరోవైపు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతన్నలపై కేసులు పెట్టడం షురూ చేశారనే పేరు తెచ్చుకున్నారు. పోయి పోయి పెట్టుకోక పెట్టుకోక నీకు రైతులే దొరికారా రేవంతు..! ఆరు గ్యారెంటీలు అటుంచి రుణమాఫీ నెత్తికెత్తుకున్నావు. ఎత్తుకుంటే ఎత్తుకున్నావు దానికి గడువు ఎవరు పెట్టుకోమన్నారు…? పెట్టుకుంటే పెట్టుకున్నావు రేషన్‌కార్డు ముచ్చట ఎందుకు తెచ్చావు..? తెస్తే తెచ్చావు అందరికీ ఇస్తానని మళ్లీ ఎందుకు మాట మార్చావు..? మారిస్తే మార్చావు… నెల రోజుల గడువెందుకు పెట్టావు.. ఇంతకు ముందు ఈ ఖాతాలకు రుణమాఫీ జరగలేదా…? సర్కార్ దగ్గర క్లారిటీగా వివరాలున్నంక టెక్నికల్ ఆటంకాలేముంటాయి..? ఇవన్నీ అడిగితే కేసులు పెడతారా..?