(దండుగుల శ్రీనివాస్)
ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆరెస్ విలీనం తప్పదని కామెంట్ చేయడమే కాదు.. దీని ద్వారా ఎవరెవరికి ఏం లబ్ది చేకూరనుందో అన్నీ తెలిసినట్టు జాతకమంతా బయటపెట్టిన మాట్లాడటం ఇప్పుడు స్టేట్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ గవర్నర్ అని, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవి అని, కవితకు బెయిల్, హరీశ్‌కు ప్రతిపక్ష హోదా అంటూ లైన్‌గా వారి జాతకాలన్నీ చెప్పేశాడు. దీని వెనుక రేవంత్ పొలిటికల్ మైండ్ గేమ్ ఉందనే విషయం అందరికీ తెలుసు. ఒక్క బీఆరెస్ నేతలకు తప్ప. ఎందుకంటే బీఆరెస్ ఎమ్మెల్యేలు ఇంకా అభద్రతా భావంలోనే ఉన్నారు.
ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌లో మార్పు రాలేదు మరి. మారేలా లేడు కూడా. దీనికి తోడు కేటీఆర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు నమ్మడం లేదు. రేవంత్ మైండ్‌గేమ్‌ను ఎంతగా కేటీఆర్ తిప్పికొట్టాలని చూసినా అవి అంతగా పనిచేయడం లేదు. ఆ పార్టీ నేతలు కూడా ఈ విలీనం టాపిక్‌ను ఆసక్తిగా చర్చించుకోవడమే దీనికి సజీవ సాక్షం. బీఆరెస్‌లో ఉన్న ఎమ్మెల్యేలను ఒక్కసారిగా బయటకు లాగి, పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ ఫిరాయింపుల కేసు నుంచి తప్పించుకోవడంతో పాటు బీఆరెస్‌ను పూర్తిగా నామరూపాలు లేకుండా చేయాలనేది రేవంత్ లక్ష్యం. ఇప్పుడు ఆ దిశగానే పావులు కదుపుతున్నాడు. మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు.
వాస్తవానికి బీజేపీకి బీఆరెస్‌ను ఇప్పటంతలో విలీనం చేసుకోవడం ద్వారా పెద్దగా లాభమేమీ లేదు. బీఆరెస్‌కు, కేసీఆర్‌కు లాభముంటుండొచ్చు. కానీ పార్టీని పూర్తిగా కోల్పోయి మనుగడ లేకుండా కేసీఆర్ బీజేపీలో మనగలుగుతాడా..? ఇంపాజిబుల్. ఇది సాధ్యం కాని పని. తన మాయల మరాఠి మాటలతో, ఎత్తుకు పై ఎత్తు వ్యూహాలతో వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒకటి చేసి మళ్లీ అధికారమే పరమావధిగా పన్నాగాలు పన్నడంలో కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయలేం. అంతలా తెలివిమీరి ఉన్న కేసీఆర్.. ఇప్పటి తాత్కాలిక అవసరాల కోసం శాశ్వత రాజకీయ ప్రయోజనాలను, అధికార దర్పాన్ని పోగొట్టుకుంటాడంటే ఎవరూ నమ్మడం లేదు. కానీ బీఆరెస్ నేతల్లో మాత్రం అనుమానం పెనుభూతమై కూర్చుంది. అలా చేయడంలో రేవంత్ సక్సెసయ్యాడు. కేసీఆర్ మౌనమూ అందుకు దోహదపడుతోంది.