(వాస్తవం ప్రధాన ప్రతినిధి)
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా మారింది సీనియర్ లీడర్, మాజీ మంత్రి , బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి పరిస్థితి. అన్నీ అనుకూలించి పార్టీ అధికారంలోకి వచ్చి, ఇక తనకు మంత్రి పదవి ఖాయమని తేలిపోయినా అదింకా వరించలేదు. తొలి మంత్రి వర్గ విస్తరణలోనే ఆయనకు చాన్స్ రావాలి. కానీ రాలేదు. రెడ్డి సామాజికవర్గ సమీకరణలో ఆయనను ఆపేశాడు రేవంత్. ఇక రేపో మాపో అంటూ ఊరిస్తూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణ ఇంకా కాకపాయె. ఇక పంద్రాగస్టులోపు అయ్యే వీలే లేదు.
సీఎ రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఆయన రావడమే ఒకరోజు ముందుగా వస్తాడు. మరి ఎప్పుడు ఢిల్లీ వెళ్లాలి… ? ఎవరెవరికి అవకాశం ఇవ్వాలో గ్రీన్ సిగ్నల్ తీసుకునేదెప్పుడు..? దీనికి కొంచెం సమయం పట్టేలా ఉంది. ఇప్పుడిదంతా ఎందుకు డిస్కషన్ అంటే.. నిజామాబాద్‌లో పంద్రాగస్టు వేళ ఎవరు జాతీయ జెండా ఎగురవేస్తారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రులు లేరు. లేని చోట కేబినెట్ ర్యాంక్ ఉన్న లీడర్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
కామారెడ్డిలో షబ్బీర్ అలీ జెండా పండుగలో పాల్గొననున్నాడు. కానీ నిజామాబాద్‌లోనే ఎవరనేది క్లారిటీ రాలేదు. సీనియర్ లీడర్‌గా సుదర్శన్‌రెడ్డికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందా..? అంటే అలా కుదరదంటున్నాయి అధికార వర్గాలు. మరి ఎలా..? ఎవరెగురేస్తారు..? ఇంకా దీనిపై అధికార వర్గాలు కూడా ఇతమిత్థంగా ఏదీ చెప్పలేకపోతున్నారు. మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జెండా ఎగురేసే చాన్స్ రాలేదు పెద్దాయనకు.
అప్పుడు ఎంపీ ఎన్నికల కోడ్ ఉండె. ప్రభుత్వానికి టెన్షన్ లేకుండా పోయిందానాడు. ఇప్పుడైనా తను మంత్రి హోదాలో పంద్రాగస్టు నాడు జెండా ఎగురేద్దామనుకుంటే రేవంత్ మంత్రి వర్గ విస్తరణ మరింత ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. దీంతో పెద్దాయన పరేషాన్‌లో ఉన్నాడట. ఇదేందిరా బై.. ఇక ఈ టర్మే నాకు చివరి రాజకీయాలనుకుంటే.. మధ్యలో ఈ ఇక్కట్లేందీ..? అని చికాకు పడుతున్నాడట.