(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ గురుతులను తొలగించే పనిలో రేవంత్ సర్కార్ విపరీతమైన ఇంట్రస్ట్ చూపుతున్నది. రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ, రాజకీయ ప్రయోజనాలే ప్రస్తుత ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తోంది. సీఎం రేవంతే స్వయంగా కేసీఆర్ గురుతులను తొలగించేలా మా పాలనుంటుందని ప్రకటించిన నేపథ్యంలో.. ఇది రాజకీయాలకే పరిమితమైతే, పాలన పరంగా తమదైన ముద్ర వేసుకుంటే పర్వాలేదు. కానీ ఈ రాజకీయ కక్షసాధింపులో రాష్ట్ర ప్రయోజనాలను కూడా తాకట్టు పెడుతోంది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు, సంస్థలన్నీ రాష్ట్రం నుంచి పారిపోవడమే దీనికి తాజా ఉదాహరణ.
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలు చేసి పలు సంస్థల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఎంవోయూలు చేసుకున్నాడు. ఆ ఒప్పందంలో భాగంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టే క్రమంలో కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు వారి ప్రభుత్వం లేదు. అధికారం పోయింది. వాటిని తీర్చాల్సిన బాధ్యత, అమలు చేయాల్సిన అనివార్యత ఇప్పటి సర్కార్ పై ఉంది. కానీ రేవంత్ ఆ సంస్థలను పట్టించుకోవడమే మానేశాడు. దీంతో ఇక ఇక్కడ మనుగడ కష్టమేనని భావనకు వచ్చేశాయి ఆయా కంపెనీలు, సంస్థలు. ఇక్కడ నుంచి బిచాణా ఎత్తేయడానికి సిద్దపడ్డాయి. దీని ద్వారా వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి పోయినట్టే. ఉపాధి అవకాశాలూ చేజేతులా జారవిడుచుకున్నట్టే.
ఇప్పటికే రాష్ట్రం నుంచి కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ గుజరాత్‌కు వెళ్లిపోయింది. కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించింది. తాజాగా 9500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్దపడ్డ అమరరాజా సంస్థ కూడా అదే బాటలో సాగుతున్నది. ఈ సంస్థ ఇప్పటికే ప్రకటించేసింది కూడా వెళ్లిపోతున్నామని, అయినా డోంట్ కేర్ అంటున్నాడు సీఎం.