(దండుగుల శ్రీనివాస్)
ఉన్నవారిని, ఉనికిని కాపాడుకునేందుకు బీఆరెస్ నానా తంటాలు పడుతున్నది. అలా నానాటికి ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతూ వస్తున్నది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే అభద్రతాభావంలో ఉన్న నేతలకు, గద్వాల ఎమ్మెల్యే రూపంలో ఓ చాన్స్ దొరికింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి తిరిగి బీఆరెస్‌లో చేరాడు. అసెంబ్లీలో ఆయన కేటీఆర్‌తో కలవడంతో ఈ ఘర్‌వాపసీ డ్రామాను ప్లే చేసింది బీఆరెస్. ఇంకా ముగ్గురు కూడా తిరిగి సొంత గూటికి చేరుతారని ప్రచారం చేసుకున్నారు. మీడియాకు లీకులిచ్చారు. ఘర్ వాపసీ అంటూ మీడియా కూడా ఊదరగొట్టింది.
కానీ అక్కడ గద్వాల ఎమ్మెల్యే మినహా ఎవరూ పార్టీ మారే యోచనలో లేరు. కాంగ్రెస్ గూటికి వెళ్లినప్పుడు అన్ని మాట్లాడుకుని వెళ్లారు. గద్వాల ఎమ్మెల్యే విషయంలో అక్కడ పరిస్థితి తిరిగబడింది. గత్యంతరం లేకనే అతను మళ్లీ బీఆరెఎస్ పంచన చేరాడు. మళ్లీ కాంగ్రెస్‌కు వెళ్లడనే గ్యారెంటీ కూడా లేదు. ఇంత మాత్రానికి బీఆరెస్ నానా హంగామా చేసింది. ప్రస్తుతం ఉనికి కాపాడుకునే దీన స్థితిలో ఆ పార్టీ ఉంది. ఇదే మంచి తరుణమని భావించినట్టుంది. పోయినవారు అక్కడ నిలవడం లేదనే ఓ సంకేతం ఇవ్వడంతో పాటు.. ఉన్నవారిని కాపాడుకునే యత్నంలో ఘర్ వాపసీ డ్రామాను తెరమీదకు తెచ్చింది.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య .. వీరు కూడా తిరిగి బీఆరెస్ గూటికి చేరుతారని మీడియాలకు లీకులిచ్చింది కేటీఆర్ అండ్ టీమ్. కానీ వారు వెంటనే దీన్ని ఖండించారు. మేము పార్టీ మారడం లేదని ఖండించేశారు. ఇప్పుడు బీఆరెస్‌లో ఉన్నవారికే భవిష్యత్ అంధకారంగా ఉంటే.. కాంగ్రెస్‌ను వీడాల్సిన పరిస్థితి ఆ ఎమ్మెల్యేలకెందుకు వస్తుంది..? మరో నాలుగేళ్ల పాటు అధికారం లేని పార్టీలో ఉండాలంటే సాధ్యమవుతుందా…? కేసీఆర్ నేర్పిన పాఠమే కదా.. దాన్నే అనుసరిస్తున్నారీ పార్టీ ఫిరాయింపు నేతలు. బీఆరెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికార పార్టీని వదిలిరావడం ఉత్తమాటే.