(దండుగుల శ్రీనివాస్ )
రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ తొలి సక్సెస్ సాధించింది. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. అమలులో చతికిలబడుతుందని అంతా అనుకున్నారు. వాస్తవానికి ఆరుగ్యారెంటీల అమలు అంత ఈజీయేం కాదు. అవి అంత తొందరగా కూడా అమలు కావు. కానీ రుణమాఫీ విషయంలో సీఎం రేవంతరెడ్డి తనకు తానుగా ఓ డెడ్‌లైన్ విధించుకోవడమే ఓ సాహసంగా అంతా భావించారు. కేసీఆర్ సర్కార్ గతంలో ఎక్కడ విఫలమైందో, రైతుల ఆగ్రహాన్ని ఎక్కడ చవిచూసిందో అదే అంశాన్ని మొదటగా టచ్ చేశాడు రేవంత్. అదీ పంద్రాగస్టులోపు.
ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పుకొచ్చినా.. ఇదెలా సాధ్యమని హరీశ్‌రావులాంటి నేతలతో పాటు సామన్య జనానికీ డౌట్‌గానే ఉండె మొదటి నుంచి . అందరి అనుమానాలను నివృత్తి చేస్తూ రెండు విడతలుగా లక్షన్నర వరకు రుణమాఫీ చేసేశాడు రేవంత్. అందరూ నోరెళ్లబెట్టేలా రుణమాఫీ అమలు చకచకా సాగిపోతున్నది. మరోవిడతగా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు చేసేస్తే కీలకమైన ఈ హామీ అమలు సంపూర్ణమైనట్టే. కాంగ్రెస్ వ్యూహం ఈ హమీ అమలులో సక్సెసయ్యిందనే చెప్పాలి.
పేదలకు మాత్రమే రుణమాఫీ వర్తించేలా ప్లాన్ చేశాడు రేవంత్. రేషన్ కార్డు ప్రామాణికం కూడా అందుకే. రేషన్‌కార్డు పేరెత్తగానే వచ్చిన ఆందోళనలు, విమర్శలకు చెక్ పెట్టేందుకు కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికే దీన్ని తీసుకుంటున్నామని, రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ అవుతుందని చెప్పుకొచ్చారు ప్రభుత్వ పెద్దలు. కానీ వ్యవహారం అలా లేదు. బడాబాబులకు చెక్‌పెడుతున్నారీ విషయంలో. ఎమ్మెల్యేలు, మంత్రులు, భూస్వాములు, వందల ఎకరాలున్నవ్యాపారులు.. వీరందరికీ రుణమాఫీ జరగలేదు. జరగదు కూడా.
అసలే ఖజానా అంతంతమాత్రమే. మరి 31 వేల కోట్లుగా పెట్టుకున్న రుణమాఫీ నిధులు .. రెండో విడత హామీ వచ్చే సరికి 12, 225 కోట్లుగానే ఉంది. మూడో విడత సంపూర్ణంగా చేసినా 31వేల కోట్లకు చేరదు. ఇప్పటి వరకు రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 17.75 లక్షలు మాత్రమే.ఇందులో ఇప్పటి వరకు బడాబాబులు లేరు.
ఎవరికి మాఫీ కావడం లేదు…? బడాబాబులందరికీ ఎందుకు రుణమాఫీ చేయాలి..? వారు రుణాలు చెల్లించే పరిస్థితుల్లో లేరా..? ప్రభుత్వం ఆ భారం ఎందుకు భరించాలె..? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నది సర్కార్. ఈ వాదన సహేతుకంగా కూడా ఉన్నది. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా లేదు. మరోవైపు ఈ హామీ అమలుకు పెద్ద ఎత్తున నిధుల సేకరణ కూడా అవసరం పడలేదు ప్రభుత్వానికి. ఒక్క హామీ అమలుతో కాంగ్రెస్ సర్కార్‌కు మంచి పేరు రావడంతో పాటు ప్రతిపక్షాన్ని మరింత డిఫెన్స్‌లో పడేసేలా చేసింది.
కేసీఆర్ అలా చేయలేదు. రైతుబంధును భూమి ఉన్న ప్రతీరైతుకు వర్తింజేసినట్టే రుణమాఫీని కూడా అందరికీ వర్తించేలా చూశాడు. అక్కడే బోల్తా కొట్టాడు. కేసీఆర్ చేసిన తప్పును రేవంత్ చేయలేదు. లక్ష రుణమాఫీని చేయడానికే అపసోపాలు పడి రైతుల ఆగ్రహానికి గురైన కేసీఆర్ చేసిన తప్పును చేయకుండా రెండు లక్షల రుణమాఫీని ఇలా ఓ వ్యూహం ప్రకారం అమలు చేస్తూ పెద్దగా వ్యతిరేకత లేకుండా తక్కువ నిధులతో ఎక్కువ ప్రచారం సొంతం చేసుకున్నది కాంగ్రెస్ సర్కార్.