(దండుగుల శ్రీనివాస్)
మందు లేనిదే సర్కార్ లేదు. ఆ రేట్లు పెంచనిదే బండి నడవదు. మందు తాగనిదే ఇక్కడ బతుకు లేదు. అది లేకపోతే రోజు గడవదు. ఇప్పుడంతా మందు గోలే. ఆఖరికి అసెంబ్లీల కూడ. ఎవరెన్ని చెప్పినా మందు ఇటు మనిషికి, అటు సర్కారుకు కచ్చితమైపోయింది. ఇది లేకపోతే ఈ రెండు నిలబడేలా లేవు. అలాంటి పరిస్థితి తెచ్చి పెట్టిండు మరి కేసీఆర్. దానికి ఇంకో ఫుల్లు కలిపిండు రేవంతు. బెల్టు షాపులు పీకేస్తామని బెల్టు ఊడదీస్తే పాంటు జారిపోవడం ఖాయం.
అందుకే ఈ బెల్టు షాపులు కళకళలాడాల్సిందే. అది ఏ సర్కారైనా. అయినా వీటి వల్ల జనానికి మరింత ప్రయోజనకరం కూడా ఎలాగంటారా..? కిరాణా షాపుల నిత్యావసరాలు కొన్నట్టు వీటిని ఎప్పుడుబడితే అప్పుడు కొనచ్చు. పది ఇరవై ఎక్కువకు. పొద్దున్నే ఇప్పుడీ మందుగోలేందెరిబై అంటరా. సరే సబ్జెక్టుకొద్దాం.
అసెంబ్లీల సీఎం రేవంత్ అన్నడు. హరీశ్ కు హఫు నాలెడ్జి, కేసీఆర్‌కు ఫుల్ బాటిల్ నాలెడ్జి అని. అదేందీ ఫుల్లు అన్నడు గానీ బాటిల్ అన్నడా? చేయి సైగతో అంత మంచిగా అందరికీ సూపిచ్చిండు కదా బై. అరే ఒక్కటే అర్థం కాదు. మాట్లాడితే కేసీఆర్ మందు గురించి తీస్తరు. మీరెవరూ మందు తాగరా. ఆయన తాగుతడు. ఓ పెగ్గో రెండు పెగ్గులో. అయితే అది తప్పా. మందు తాగినోడు మనిషే కాదంటే మరి ఊర్లల్ల దుకణాల దాకా తెచ్చి పీకల దాకా ఎందుకు తాగిస్తుండ్రు. జనాలను మనుషుల్లా కాకుండా ఓట్లేసే గొర్రెలు, తాగి ఆదాయం తెచ్చి పెట్టి సచ్చే పీనుగులన్నమాట.
కేసీఆర్ మందు తాగుతడు. సరే, అసెంబ్లీల ఆయన మందు గోల ఎందుకొచ్చింది. రేవంత్ తెచ్చిండు. ఎందుకు..? హాఫ్ నాలెడ్జి అనే మాటినే సరికి. ఫుల్లు బాటిల్ ప్రాస మంచిగా ఉంటదని, అది కేసీఆర్‌కు పెట్టి మాట్లాడితే పేలుతదని అనుకున్నట్టున్నాడు రేవంతు. అది సందర్భమా సీఎం సారు. రాజకీయ స్పీచులు దంచేందుకు అదే ఎలక్షన్ సభనా? అయినా కేసీఆర్‌ను తాగుబోతోడు అని అని చెప్పానులకునే నీ దుగ్ధ తప్ప ఆ మాటలో అర్థం ఉందా? మరి ఆ తాగుబోతోడు ప్రవేశపెట్టిన పథకాలెందుకు కాపీ కొట్టినవు?
కేసీఆర్‌ను పదేండ్లు సీఎం చేసిన జనాలు కూడా తాగుబోతులే కదా అందుకే అప్పుడు గెలిపించిండ్రు. మరి ఇప్పుడు ఆ తాగుబోతు జనాలు కాంగ్రెస్‌ను గెలిపించిండ్రు. తాగింది దిగినంక మళ్లా ఎవర్ని గెలిపిస్తరో ఏందో..? అవును రేవంత్ సారు తాగడా? కాంగ్రెస లీడర్లకు చుక్క, ముక్క అసలే పడవా? వీళ్లంతా పత్తిత్తులా? ఏదేమైనా తాగుడు గురించి, తాగుబోతుల గురించి చులకన చేసినట్టు మాట్లాడిన… అదీ అసెంబ్లీలో ఇజ్జత్ తీసిన రేవంత్ తాగుబోతులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలె.