అప్పుడు అగ్గిపెట్టె దొరకలేదు..!
ఇప్పుడు పెన్ను దొరకడం లేదు..!!
హరీశ్‌రావు రాజీనామాపై మధుయాష్కీ సెటైర్లు..
హరీశ్‌రావు రాజీనామా సవాల్‌కు షరతులు వర్తిస్తాయి…!
పంద్రాగస్టులోపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిందే..
సంపూర్ణంగా అమలు చేస్తేనే రాజీనామా అంటు మెలిక..
అమలు చేయకపోతే రేవంత్ రాజీనామా చేయాలంటూ కండిషన్..
పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన హరీశ్‌రావుకు ఇప్పుడు కాంగ్రెస్ సెక్షన్ నుంచి దెప్పిపొడుపు మాటలు ఎదురవుతున్నాయి. దీన్ని ముందే పసిగట్టిన హరీశ్‌రావు తనే ముందు స్పందిచాడు. రుణమాఫీయే కాదు.. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరాలని కండిషన్ పెట్టాడు. అలా చేస్తేనే రాజీనామా చేస్తానన్నాడు. అలా చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాడు.
కానీ ఇది పెద్దగా వర్కవుట్ కాలేదు. దీనిపై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ స్పందిచాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి విద్యార్తులను రెచ్చగొట్టిన హరీశ్‌రావుకు ఆనాడు అగ్గిపెట్టె దొరకలేదని, ఇప్పుడు రాజీనామా చేస్తానని పలికి చేసేందుకు పెన్ను దొరకడం లేదని ఎద్దేవా చేస్తూ కామెంట్స్ పెట్టాడు.
తిరగబడ్డ రాజీనామా అస్త్రం…
హరీశ్‌రావు మరోసారి రాజీనామా అస్త్రాన్ని తెరపైకి తెచ్చాడు. ఆపత్కాలంలో, రాజకీయ విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్, హరీశ్‌రావులకు ఈ రాజీనామా అస్త్రం ఓ రక్షణ కవచంలా పనిచేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు హరీశ్‌రావు దీన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిపై రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. రుణమాఫీ చేయడం మొదలుపెట్టామని రైతులతో కాంగ్రెస్ సర్కార్ సంబురాలు చేసుకుంటున్న తరుణంలో.. హరీశ్ తనదైన శైలిలో సీఎంపై రాజీనామా అస్త్రాన్ని ఎక్కుపెట్టి డిఫెన్స్‌లో పడేయాలనే ప్రయత్నం చేశారు.
అయితే అది కండిషన్లతో కూడుకున్నదిగా ఉండటం గమనార్హం. పంద్రాగస్టులోపు ఆరు గ్యారెంటీలు.. (13 హామీలు) సంపూర్ణంగా అమలు చేయాలని, అలా చేస్తే తాను రాజీనామాకు సిద్దమన్నారు. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు హరీశ్. పంద్రాగస్టులోగా రెండు లక్షల రుణమాఫే సాధ్యం కాదు. ఆ విషయాన్ని ప్రభుత్వమే ఒప్పుకుంటున్నది.
ఆగస్టు నెలాఖరులోగా మూడు విడతల్లో పూర్తిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పుకుంటున్నది సర్కార్. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు విసరిన సవాల్ పూర్తిగా కండిషన్లకు లోబడి ఉన్నాయి. తన రాజీనామాకు షరతులు వర్తిస్తాయి అనే విధంగా ఈ సవాల్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.